AAP Situation After Kejriwal Arrest :దిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు దేశంలోని రెండు రాజకీయ పార్టీలకు పెను సవాళ్లు విసురుతోంది. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఈ ఎన్నికల వేళ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుతో బీఆర్ఎస్ అధినాయకత్వం ఒత్తిడిలోకి వెళ్లింది. ఎన్నికల వ్యూహరచన చేయాల్సిన ఈ తరుణంలో కేసీఆర్ కుటుంబం దృష్టి అంతా కవితకు న్యాయ సహాయం అందించడంపైకి మళ్లింది.
మరోవైపు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఈడీ అరెస్టు చేయడం వల్ల ఆప్ క్యాడర్ సైతం డైలమాలో పడిపోయింది. 2023 ఫిబ్రవరిలో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు అరెస్టైన కేజ్రీవాల్ పరిస్థితేంటి ? ఆయన కూడా దీర్ఘకాలం పాటు జైల్లోనే ఉండాల్సి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్ ఏంటి ? దిక్సూచిగా నిలిచే కేజ్రీవాల్ లేకుండా పార్టీ మునుపటి ఉత్సాహంతో ముందుకు సాగగలదా ? అనే సందేహం ఆప్ వర్గాల్లో తలెత్తుతోంది.
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అమలుచేస్తే!
అరవింద్ కేజ్రీవాల్ తన విజన్‌కు అనుగుణంగా ఆప్‌ను జాతీయ పార్టీ స్థాయికి తీసుకొచ్చారు. దిల్లీ, పంజాబ్, హరియాణా, గుజరాత్‌లో చెప్పుకోదగిన స్థాయిలో ఆప్ క్యాడర్ ఇప్పుడు ఉందంటే దానికి కారణం- కేజ్రీవాల్ విజన్ !! ఆయన జైల్లోనే ఉంటే ఆప్ బలంగా నిలబడుతుందా ? బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం ధాటికి తడబడుతుందా ? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.
ఎన్నికల వేళ ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులను బీజేపీ తమ గూటిలో చేర్చుకుంటోంది. త్వరలో ఇదే ప్లాన్‌ను ఆప్ బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే సీన్ మారిపోతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ అనుకున్న రేంజులో ఫలితాలను సాధించే అవకాశాలు ఉండవని విశ్లేషిస్తున్నారు.