Floater Credit Card Benefits : నేటి కాలంలో చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. ఇవి వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ ఒక కుటుంబం/ చిన్న బిజినెస్/ చిన్న గ్రూప్ మొత్తం ఉపయోగించడానికి వీలుగా ఉంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా! అందుకే ఇప్పుడు ప్రముఖ బ్యాంకులు అన్నీ ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్‌లను అందిస్తున్నాయి. వీటి ద్వారా సింగిల్ అకౌంట్ ఉపయోగించి చాలా మంది యూజర్లు ఒక క్రెడిట్ కార్డులు ఉపయోగించడానికి వీలవుతుంది. మరి ఈ ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్స్ ఎలా పనిచేస్తాయి? వీటిని ఉపయోగించడం మంచిదేనా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?
ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్ అనేది ఒక అకౌంట్‌తో లింకై ఉంటుంది. దీనికి ఒక క్రెడిట్ లిమిట్ ఉంటుంది. ఈ అకౌంట్‌లోని యూజర్లు అందరికీ వేర్వేరు క్రెడిట్ కార్డులు జారీ చేస్తారు. దీంతో ఒకేసారి అనేక మంది వ్యక్తులు ఈ ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. మరి ఇది ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.
ఉదాహరణకు, ఒక ఫ్లోటర్ కార్డ్‌పై రూ.1లక్ష రూపాయల వరకు క్రెడిట్ పరిమితి ఉంది అనుకుందాం. ఒక వ్యక్తి అందులో రూ.50వేలు వరకు ఉపయోగించుకున్నారు. అప్పుడు మిగతా యూజర్లు అందరూ కలిసి మిగతా రూ.50వేలు పరిమితి వరకు మాత్రమే ఉపయోగించుకోగలుగుతారు.
యూజర్లు అందరి వద్ద వేర్వేరు క్రెడిట్ కార్డులు ఉన్నప్పటికీ, అవన్నీ ఒకే ఖాతాతో అనుసంధానమై ఉంటాయి. అందుకే ఆర్థిక లావాదేవీలను సులువుగా ట్రాక్ చేయడానికి, మేనేజ్ చేయడానికి వీలవుతుంది.
బిల్లింగ్ సంగతేంటి?
ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్ అకౌంట్‌లో ఎంత మంది యూజర్లు ఉన్నప్పటికీ ఒకే బిల్లు జనరేట్ అవుతుంది. అయితే వేర్వేరు యూజర్లు ఎంత మేరకు క్రెడిట్ వాడుకున్నారో ఖాతా చేసి తెలుసుకోవచ్చు.
ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్ ఉపయోగాలు ఏమిటి?
ఒక కుటుంబంలోని వ్యక్తులు అందరూ తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటి అద్దె, కిరాణా సామానుల కొనుగోలు, ఇతర షాపింగ్ ఖర్చులు, ప్రయాణ ఖర్చులు సహా అన్ని రకాల గృహఖర్చులను ట్రాక్ చేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఆర్థిక అవసరాల కోసం వేర్వేరు బ్యాంకు ఖాతాలను, క్రెడిట్ కార్డులను తీసుకోవాల్సిన అవసరం తప్పుతుంది. సింగిల్ బిల్ వస్తుంది కనుక చాలా సులువుగా అప్పు తీర్చడానికి వీలవుతుంది. అంతే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే, వాటన్నింటికీ యాన్యువల్ ఫీజులు, ఛార్జీలు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఫ్లోటర్ క్రెడిట్ కార్డుల వల్ల ఇలాంటి అనవసర ఆర్థిక భారం తగ్గుతుంది. ఏ యూజర్ ఎంత వాడుకున్నప్పటికీ, రివార్డ్ పాయింట్లు అన్నీ సింగిల్ అకౌంట్లో పడతాయి. కనుక క్యాష్‌బ్యాక్, ఎయిర్ మైల్స్, డిస్కౌంట్‌లను మొత్తం యూజర్లలో ఎవరికి అవసరమైతే వాళ్లు వాడుకోవచ్చు. బిజినెస్ చేసేవాళ్లు తమ దగ్గర పనిచేసే ఉద్యోగులకు వేర్వేరు కార్డులు ఇవ్వాల్సిన అవసరం తప్పుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ్లోటర్ క్రెడిట్ కార్డులను చాలా జాగ్రత్తగా వాడాలి. ఎంత మంది యూజర్లు ఉంటే, అందరూ ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణతో మెలగాలి. క్రెడిట్ కార్డ్ పరిమితికి మించి ఖర్చు చేయకూడదు. సకాలంలో బిల్లులు చెల్లించాలి. అప్పుడే అదనపు ఛార్జీలు, వడ్డీలు, పెనాల్టీలు పడకుండా ఉంటాయి.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
రివార్డులు, బోనస్ పాయింట్ల కోసం క్రెడిట్ కార్డ్ చర్నింగ్ చేస్తున్నారా? లాభనష్టాలు ఇవే!
క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్‌ను కంపెనీలు ఇవ్వడం లేదా? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్!