Kejriwal Rules Out Tie up With Congress : రానున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆదివారం వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి ప్రకటన చేయడం వల్ల ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.
ఒంటరి పోరుకు సిద్ధం!
"దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పొత్తులకు దూరంగా ఉంటుంది. ఒంటరి పోరుకు మేము సిద్ధం అవుతున్నాం" అని విలేకరుల సమావేశంలో పాల్గొన్న కేజ్రీవాల్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఇంతకు ముందే, దిల్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా చేస్తామని కాంగ్రెస్ కూడా ప్రకటించింది.
కలిసి పోటీ చేసినా నో యూజ్!
వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో దిల్లీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ రెండూ కలిసి పోటీ చేశాయి. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. మొత్తం లోక్ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే ఈ ఏడాది పంజాబ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడానికి ఆప్ నిరాకరించి, 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. ఇక హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు.
లిక్విడ్ ఎటాక్
శనివారం దక్షిణ దిల్లీలోని మాలవీయ నగర్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. మెరుపు వేగంతో స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడిపై తాజాగా కేజ్రీవాల్ స్పందించారు.
"అసలు నేను చేసిన తప్పు ఏమిటి? దిల్లీ శాంతిభద్రతల అంశాన్ని లేవనెత్తాను. కేంద్రమంత్రి అమిత్ షా ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ దానికి బదులు పాదయాత్రలో నాపైనే దాడి జరిగింది. ఓ వ్యక్తి నాపై ద్రావకం చల్లాడు. అది హానికరమైనది కావొచ్చు. అయినా మేము భయపడం. మేము ప్రజా సమస్యలను లేవనెత్తాం. మీకు వీలైతే గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేయించండి. అంతే కానీ, మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు" అని మోదీ సర్కార్‌ను ప్రశ్నించారు.