తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​ సమావేశాలకు అంతా రె'ఢీ'- అదానీపై విపక్షాల గురి- కేంద్రం అజెండా ఇదే! - PARLIAMENT WINTER SESSION

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు - కేంద్రం అజెండాలో వక్ఫ్​ యాక్ట్ సహా 16 కీలక బిల్లులు

Indian Parliament
Indian Parliament (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 7:20 PM IST

Parliament Winter Session :పార్లమెంట్​ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. నవంబర్​ 25 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో వక్ఫ్​ చట్టం సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులు ప్రభుత్వ అజెండాలో ఉన్నాయి. వీటిలో 5 కొత్త బిల్లులు ఉండగా, మరో 11 బిల్లులను పరిశీలన చేసి ఆమోదించాల్సి ఉంది. అయితే అదానీ అంశాన్ని చర్చకు తీసుకొచ్చేందుకు విపక్షాలు చూస్తున్నాయి.

వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా?
వక్ఫ్​ యాక్ట్​ (సవరణ) బిల్లును ఈ పార్లమెంట్​ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఈ బిల్లును పార్లమెంట్​ ఉభయ సభల సంయుక్త కమిటీ పరిశీలిస్తోంది. బహుశా ఈ కమిటీ తన నివేదికను ఈ నెల 29న సమర్పించే అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ సెషన్​ మొదటి వారం చివరి రోజున ప్యానెల్ తన నివేదికను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే విపక్షాలు మాత్రం కమిటీ తన నివేదికను సమర్పించేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరుతున్నాయి.

ముసల్మాన్​ వక్ఫ్​ (రద్దు) బిల్లు : వక్ఫ్​ యాక్ట్​కు అనుబంధంగా ఉన్న ముసల్మాన్ వక్ఫ్​ (రద్దు) బిల్లు కూడా ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్​ ముందుకు రానుంది.

5 కొత్త బిల్లులు
ఈ పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్​ షిప్పింగ్​ బిల్లు, ఇండియన్​ పోర్ట్స్ బిల్లు, పంజాబ్​ కోర్ట్​ (సవరణ) బిల్లు, రాష్ట్రీయ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు అనే 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.

వాడీవేడిగా అఖిలపక్ష సమావేశం
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌ ప్రధాన కమిటీ రూమ్‌లో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన సమావేశాన్ని కేంద్రం నిర్వహించింది. అయితే ఈ సమావేశం వాడీవేడిగా జరిగింది. మణిపుర్ హింస, అదానీ గ్రూప్‌పై అమెరికాలో లంచం కేసు నమోదు కావడం తదితర అంశాలపై ఈ పార్లమెంట్​ సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ కోరింది. అంతేకాదు దేశంలో పెరుగుతున్న కాలుష్యం, రైలు ప్రమాదాలు లాంటి విషయాలపైనా చర్చించాలని పట్టుబట్టింది. ఇక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు సహా కాంగ్రెస్ ఎంపీలు జైరాంరమేశ్, ప్రమోద్‌తివారీ సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ ఎంపీలు మిధున్ రెడ్డి, విజయసాయి, జేడీయూ, ఎస్​పీ ఇతర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాల సహకారాన్ని కేంద్రం కోరింది.

ముగింపు ఎప్పుడంటే
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి మొదలై డిసెంబరు 20 వరకూ కొనసాగనున్నాయి. సెలవులు తీసివేస్తే మొత్తం 19 రోజులు ఈ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 26న ఈ సమావేశాలు జరగవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details