ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పోరు - కుటుంబ సభ్యుల మధ్యే గట్టి పోటీ! - JHARKHAND ASSEMBLY ELECTION
ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాలు - భార్యాభర్తలు, తండ్రీకుమారులు, వదినామరదళ్ల మధ్య పరస్పర పోటీ
Jharkhand Polls (ETV Bharat)
Published : Nov 10, 2024, 8:50 AM IST
Jharkhand Polls Family Members War :ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈసారి కుటుంబంలోని సభ్యులే పరస్పరం పోటీకి దిగారు. భార్యాభర్తలు, తండ్రీకుమారులు, వదినామరదళ్లు ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. రక్త సంబంధీకులే పోటీపడుతున్న పరిస్థితులూ నెలకొన్నాయి. దీంతోపాటు దాదాపు అర డజను మంది రాజకీయ నేతల కోడళ్లు ఎన్నికల బరిలో నిలిచారు.
- ధన్‌బాద్‌లోని తుండీలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) తరఫున సిటింగ్ ఎమ్మెల్యే మధుర ప్రసాద్ మహతో పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి వికాస్ కుమార్ మహతోతోనే కాకుండా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తన కుమారుడు దినేశ్ మహతోనూ పోటీకి దిగారు.
- ఝారియాలో తండ్రీకుమారులు తలపడుతున్నారు. ఝార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతి మోర్చా (జేకేఎల్‌ఎం) అభ్యర్థిగా మహ్మద్ రుస్తాం అన్సారీ పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు సద్దాం హుస్సేన్ అలియాస్ బంటీ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.
- ఝారియాలో ఇద్దరు మహిళలు పోటీ పడుతున్నారు. వారు ఇద్దరు కజిన్ల సతీమణులు. కాంగ్రెస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే పూర్ణిమ నీరజ్ సింగ్, ఆమె ప్రత్యర్థిగా బీజేపీ నుంచి రాగిణి సింగ్ పోటీ చేస్తున్నారు. పూర్ణిమ భర్త నీరజ్ సింగ్ 2017లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో అతడి కజిన్, రాగిణి భర్త సంజీవ్ సింగ్ జైలుకు వెళ్లి వచ్చారు.
- గోమియాలో చిత్తరంజన్ సావో, ఆయన భార్య సునీతా దేవి స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు.
- ఎన్నికల్లో కుమారులు, కోడళ్లు రంగంలోకి దిగడం సర్వసాధారణంగా మారింది. ఝార్ఖండ్‌లో అసాధారణ సంఖ్యలో కుమారులు, కోడళ్లు మధ్య పోటీ నెలకొంది.
- జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్ ఇద్దరు కోడళ్లు సీతా సోరెన్, కల్పనా సోరెన్ జంతారా, గాండేయ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో కల్పన జేఎంఎం నుంచి, సీతా బీజేపీ నుంచి బరిలోకి దిగారు.
- ఉమ్మడి బిహార్‌లో బలమైన నేత అయిన అవధ్ బిహారీ సింగ్ కోడలు దీపికా పాండే మహాగామా నుంచి బరిలో నిలిచారు.
- మంత్రి సత్యానంద్ భక్త కోడలు రష్మీ ప్రకాశ్ ఛాత్ర నుంచి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) తరఫున పోటీ చేస్తున్నారు.
- ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దివంగత నిర్మల్ మహతో కోడలు సవిత మహతో జేఎంఎం తరఫున ఐకాగఢ్ నుంచి పోటీకి దిగారు.
- మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ 5 సార్లు ప్రాతినిధ్యం వహించిన జెంషెడ్‌పుర్ తూర్పు నుంచి ఈసారి ఆయన కోడలు పూర్ణిమ దాస్ సాహు బరిలోకి దిగారు. ఆమెతో జెంషెడ్‌పుర్ మాజీ ఎస్పీ అజోయ్ కుమార్ తలపడుతున్నారు.