Bhopal Gas Tragedy Toxic Waste Disposal :భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత యూనియన్ కార్బైడ్ సంస్థ ఆవరణలో దాదాపు 40 ఏళ్లుగా పడివున్న 377 టన్నుల విషపూరిత వ్యర్థాలను తాజాగా అధికారులు తరలించారు. ఈ ప్రమాదకర వ్యర్థాలను ధార్ జిల్లాలో ఉన్న పీతంపుర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
12 సీల్డ్ కంటైనర్లలో తరలింపు
యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలోని విషపూరిత వ్యర్థాలు నింపిన 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కులు బుధవారం రాత్రి 9గంటలకు భోపాల్‌కు 250 కి.మీ దూరంలో ఉన్న పీతంపుర్కు బయలుదేరాయి. ఈ ట్రక్కులు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసేందుకు ప్రత్యేక గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య వ్యర్థాలతో నిండిన ఉన్న ట్రక్కులు గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు పీతంపుర్లోని ఇండస్ట్రీయల్ ఏరియాకు చేరుకున్నాయని ధార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ట్రక్కులను పీతంపుర్లోని ఫ్యాక్టరీ క్యాంపస్‌లో ఉంచామని పేర్కొన్నారు.
ట్రక్కుల కోసం గ్రీన్ కారిడార్
విషపూరిత వ్యర్థాలతో నిండిన ఉన్న ట్రక్కులు ఏడు గంటలు ప్రయాణించి ధార్ జిల్లాలోని పీతంపుర్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్నాయని రాష్ట్ర గ్యాస్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. అందుకు కోసం గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
"యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలోని వ్యర్థాలను ప్యాకింగ్, లోడింగ్ చేసే ప్రక్రియలో ఆదివారం నుంచి బుధవారం రాత్రి వరకు దాదాపు 100 మంది కార్మికులు పాల్గొన్నారు. ఇందుకోసం ఒక్కొ కార్మికుడు అరగంట పాటు షిఫ్టులో పనిచేశారు. ప్రతీసారి షిప్టు పూర్తికాగానే ఆయా కార్మికులకు హెల్త్ చెకప్స్ చేయించాం." అని స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు.
హైకోర్టు ఆగ్రహం
యూనియన్ కార్బైడ్ సంస్థలో పేరుకుపోయిన విషపూరిత వ్యర్థాలను తొలగించకపోవడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవలే అధికారులను మందలించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు యూనియన్ కార్బైడ్ సంస్థలోని వ్యర్థాలను ఎందుకు తొలిగించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార నేరం కింద కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించింది. అలాగే ప్రమాదకర వ్యర్థాలను తొలగించడానికి నాలుగు వారాల డెడ్‌లైన్‌ను విధించింది. దీంతో అధికారులు తాజాగా భోపాల్ ఫ్యాక్టరీలోని వ్యర్థాలను పీతంపుర్ పారిశ్రామిక ప్రాంతానికి తరలించారు.
కేంద్ర, రాష్ట్ర అధికారుల సమక్షంలో
పీతంపుర్ పారిశ్రామిక కారిడార్ డిస్పోజల్ యూనిట్లో తొలుత కొంత మొత్తంలో వ్యర్థాలను ప్రత్యేకంగా దహనం చేస్తామని రాష్ట్ర గ్యాస్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ వెల్లడించారు. తర్వాత వచ్చే బూడిదలో కూడా ఏమైనా రసాయనాలు ఉన్నాయేమో పరీక్షలు జరుపుతామన్నారు. అంతా బాగానే ఉందని తేలితే 3నెలల్లో వ్యర్థాలను దహనం చేస్తామని, లేదంటే 9 నెలల సమయం పట్టొచ్చని అన్నారు. వ్యర్థాలను దహనం చేయగా వచ్చిన బూడిదను రెండంచెల్లో భద్రపరిచి భూస్థాపితం చేస్తామని చెప్పారు. ఈ బూడిద ఎక్కడా భూమిని తాకకుండా, నీటిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకొంటామన్నారు. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యవేక్షణలో నిపుణుల బృందం ఈ ప్రక్రియను చేపడుతుందని వెల్లడించారు.
'ఎటువంటి ఆందోళన అవసరం లేదు'
2015లో పీతంపుర్‌లో 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మకంగా కాల్చివేశారని, ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లోని మట్టి, భూగర్భ జలాలు, నీటి వనరులు కలుషితమయ్యాయని కొందరు సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు. తాజాగా సింగ్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. 2015లో జరిగిన పరీక్షల ఆధారంగానే తాజాగా ప్రమాదకర వ్యర్థాలను తరలిస్తున్నట్లు చెప్పారు. స్థానికులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
స్థానికుల ఆందోళన
కాగా, పీతంపుర్‌లో దాదాపు 1.75 లక్షల జనాభా ఉన్నారు. పీతంపుర్‌లో యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను పారవేయడాన్ని వ్యతిరేకిస్తూ వారు ఆదివారం ఆందోళన చేపట్టారు.
వేలాది మంది మృతి
1984 డిసెంబరు 3న (డిసెంబరు 2 అర్ధరాత్రి దాటిన తర్వాత) భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో అత్యంత ప్రమాదకర మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో దాదాపు 5,479 మంది మరణించారు. వేలాది మంది తీవ్రమైన, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు.
నెలరోజులుగా ఫోన్ల వాడకం పూర్తిగా బంద్ - ఐఫోన్పైనా ఆ ఫ్యామిలీకి డౌట్లు - ఇదీ కారణం!
21రోజుల్లో 3రాష్ట్రాలు, 300 కి.మీ జర్నీ- ఎట్టకేలకు చిక్కిన ఆడపులి 'జీనత్'