రాజస్థాన్‌లో బోరుబావులు చిన్నారులను మింగేస్తున్నాయి!. ఇటీవల 175 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిన 5 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మరవకముందే, అలాంటి మరో ఘటన జరిగింది. కౌట్పూతలో-బహ్రోడ్ జిల్లాలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి పొలంలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు 150 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్, జేసీబీలతో ఘటనాస్థలికి చేరుకున్నట్లు డీఎస్పీ రాజేంద్ర బుర్దకు తెలిపారు. ప్రస్తుతం బాలికకు ఆక్సిజన్‌ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక బాలిక కదలికలను కెమెరా ద్వారా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆ బోరుబావిని బాలికి తండ్రి భూప్‌సింగ్ జాట్ కొద్ది రోజుల క్రితమే తవ్వించినట్లు స్థానికులు తెలిపారు. అంతకుముందు పరిశ్రమల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అధికారులతో మాట్లాడారు. బాలికను త్వరగా రక్షించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
బోరుబావుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాజస్థాన్ పోలీసులు ఎక్స్ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఎండిపోయిన బావులు, బోరుబావులు ప్రజలకు ప్రమాదకరమని తెలిపారు. ఎక్కడైనా ఓపెన్ బోర్‌వెల్ లేదా ఎండిపోయిన బావిని చూస్తే ఎస్‌డీఆర్‌ఎఫ్ హెల్ప్‌లైన్ 0141-2759903 లేదా 8764873114కు తెలియజేయాలని తెలిపారు.