2024 Lok Sabha elections phase 2 :లోక్‌సభ ఎన్నికల మెుదటి విడత పోలింగ్ ఏప్రిల్ 19న జరనుండగా రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనున్నాయి. 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 88 నియోజకవర్గాలకు రెండో విడతలో పోలింగ్ జరగనుంది. కేరళలో అత్యధికంగా 20 స్థానాలు, కర్ణాటకలో 14, రాజస్థాన్ 13, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ర్టల్లో చెరో 8, మధ్యప్రదేశ్‌లో 7 స్థానాలకు రెండో విడతలో భాగంగా ఎన్నికలు జరగనున్నాయి. అసోం, బిహర్‌లో చెరో 5, ఛత్తీస్‌గఢ్, బంగాల్‌లో చెరో 3, త్రిపుర 1 స్థానం, ఔటర్ మణిపుర్, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఒకస్థానానికి రెండోవిడతలో పోలింగ్ జరగనుంది. మెుత్తం 88 నియోజకవర్గాల్లో 12 వందల 10 మంది అభ్యర్థులు ఏప్రిల్ 26న తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
రెండో దశలో పోటీకి సిద్ధమైన 1,210 మంది అభ్యర్థులు
రెండో విడతలో ఎన్నికలు జరగనున్న 88 నియోజకవర్గాలకు మొత్తం 2, 633 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. వాటి పరిశీలన అనంతరం 1,428 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని వెల్లడించింది. కొందరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడం వల్ల చివరికి 1,210 బరిలో నిలిచినట్లు పేర్కొంది. రెండో విడతలో కేరళలో 20 లోక్‌సభ స్థానాల నుంచి అత్యధికంగా ఐదు వందల నామినేషన్లు వచ్చినట్లు వివరించింది. కర్ణాటకలోని 14 స్థానాల నుంచి 491 నామినేషన్లు వచ్చాయని తెలిపింది. త్రిపురలో ఒక స్థానం నుంచి అత్యల్పంగా 14 నామినేషన్లు వచ్చాయని వెల్లడించింది. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి గరిష్ఠంగా 92 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఔటర్ మణిపుర్‌లోని పార్లమెంటరీ నియోజకవర్గంలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఏప్రిల్ 19న మొదటి దశలో, మిగిలిన 13 అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఏప్రిల్ 26న రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి.