Class 12th Student Argument In High Court :ఈ డబ్ల్యూఎస్ రిజిర్వేషన్లపై ఓ ఇంటర్ విద్యార్థి కోర్టులో చేసిన వాదన జడ్జిని ఇంప్రెస్ చేసింది. దీంతో ఆ జడ్జి 'నువ్వు డాక్టర్ కాదు లాయర్ కావాలి' అని అన్నారు. కనీసం డిబేట్ కాంపిటీషన్లలో పాల్గొన్న అనుభవం కూడా లేకుండా కోర్టులో లాజికల్ పాయింట్లతో జడ్జిని ఇంప్రెస్ చేశాడు అతడు. తనకు కోర్టు న్యాయం చేయాలని కోరుకున్నాడు. అసలు ఆ ఇంటర్ విద్యార్థి ఎవరు? ఎందుకోసం తన కేసులో తానే వాదనలు వినిపించాల్సి వచ్చింది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అక్కడ డౌట్ వచ్చింది!
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు చెందిన లాయర్ మనోజ్ చతుర్వేది కుమారుడు అథర్వ్ చదుర్వేది(19). అథర్వ్ నీట్ 2024 పరీక్షలో 720 మార్కులకు 530 స్కోర్ చేశాడు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఏదో ఒక ప్రైవేటు కాలేజీలో సీటు కచ్చితంగా వస్తుందని ధీమాగా ఉన్నాడు. అయితే లాస్ట్ రౌండ్ కౌన్సెలింగ్‌లో కూడా అతడిగి సీటు రాలేదు. దీంతో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదని గ్రహించాడు. అంతేకాకుండా రిజర్వ్ అయిన సీట్లు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్నాడు.
ఇది తనతో పాటు తనలాంటి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అన్యాయంగా భావించాడు అథర్వ్. ఈ విషయాన్ని తన తండ్రి మనోజ్ చతుర్వేది చెప్పాడు. అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మొదటి విచారణలో అథర్వ్ తరఫున అతడి తండ్రి మనోజ్ వాదించారు. అయితే పిటిషన్లో నీట్ పరీక్షను ఛాలెంజ్ చేశారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత ఈ కేసులో తానే వాదనలు వినిపించాలని అథర్వ్ నిర్ణయించుకున్నాడు.
నిర్ణయం అయితే తీసుకున్నాడు కానీ అది అంత సులభం కాదు. అథర్వ్ స్కూల్లో ఎప్పుడూ డిబేట్ కాంపిటీషన్లలో పాల్గొనలేదు. చట్టాల గురించి అవగాహన లేదు. అయినా అక్కడితో ఆగాలనుకోలేదు. వాదనలకు ముందు రాజ్యాంగం, చట్టాల్లోని సెక్షన్లు, కోర్టు తీర్పులు, గెజిట్ నోటిఫికేషన్లు వంటి వాటి గురించి చదివి కనీస అవగాహన తెచ్చుకున్నాడు. అనంతరం కోర్టు కార్యకలాపాలు ఎలా జరుగుతాయో తెలుసుకుని, అందుకు అనుగుణంగా వాదనలకు ప్రిపేర్ అయ్యాడు.