ఎస్బీఐ కస్టమర్ సెంటర్లో పట్టపగలే దోపిడీ, తలపై సుత్తితో కొట్టి - ఎస్బీఐ కస్టమర్ సెంటర్లో దోపిడీ
🎬 Watch Now: Feature Video
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో పట్టపగలే దుండగులు రెచ్చిపోతున్నారు. గతకొద్ది రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఓ యువకుడు చోరీకి పాల్పడ్డాడు. సుత్తితో నిర్వాహకుడి తలపై బలంగా దాడి చేసి, కౌంటర్లో ఉన్న సొమ్ము తీసుకుని పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన నిర్వాహకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. మరోవైపు, వృద్ధురాలిని తుపాకీతో బెదిరించి ఇద్దరు యువకులు దోపిడీకి యత్నించిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగింది. కేఆర్‌పురంలోని డీటీ ప్రకాశ్ ఇంటికి ఇద్దరు యువకులు.. డెలివరీ బాయ్ అని చెప్పి డోర్ బెల్ కొట్టారు. వెంటనే ఓ వృద్ధురాలు బయటకు రాగా.. ఆమెను తుపాకీతో బెదిరించి బంగారు గొలుసు లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన బామ్మ.. గట్టిగా కేకలు పెట్టడం వల్ల దొంగలు పారిపోయారు. సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.