AGENCY PROBLEMS: సరుకులు కొనాలంటే.. ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే! - తెలంగాణ వార్తలు
🎬 Watch Now: Feature Video
నిత్యావసరాలు కొనాలంటే ఆ ప్రాంతవాసులు ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే. గమ్యం చేరాలంటే సాహసం తప్పదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రమాదకరంగా కాలం వెల్లదీస్తున్నారు. ఈ కష్టకాలంలో అందరూ చేయిచేయి కలిపి సమస్యను గట్టెక్కించారు. చిన్నాపెద్దా కలిసి మోకల్లోతు నీటిని దాటారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ వాసులు ప్రమాదకరంగా కాలం వెల్లదీస్తున్నారు. ఏ చిన్న అవసరం వచ్చినా ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్లలోంచి బయటకు వస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వాగులు వంకలు దాటేందుకు పెద్ద సాహసమే చేస్తున్నారు. నిత్యావసరాలు, అత్యవసరం వచ్చిందంటే క్షేమంగా ఒడ్డుకు చేరతారనే నమ్మకం లేకపోయినా ముందుకు సాగుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్హట్నూర్ మండలం కొత్తపల్లి గిరిజనులు నిత్యావసరాల కోసం స్థానికంగా ఉన్న బండ్రేవు వాగును దాటాలి. గురువారం వారాంతపు సంత కోసం బజార్హట్నూర్ వెళ్లారు. సరకులు తీసుకొని వాగువద్దకు చేరగా నీటి ఉద్ధృతి పెరిగింది. ఏం చేయాలో పాలుపోని గిరిజనులు నెత్తిన సరుకుల బరువు మోస్తూనే ఒకరిచేయి ఒకరు పట్టుకొని ప్రమాదకరంగా వాగుదాటారు. వంతెన లేక ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.