Young Man Dies at Sabitham Waterfalls : జలపాతంలో దిగొద్దని వారించినా దిగారు.. చివరకు..
🎬 Watch Now: Feature Video
Peddapalli Sabitham Waterfalls : రాష్ట్రంలో వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతాల్లో దిగవద్దని అధికారులు ఎంత చెప్పినా.. కొంత మంది పట్టించుకోవడం లేదు. దీని వల్ల ప్రాణాలు పొగొట్టుకోవాల్సి వస్తోంది. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం జలపాతంలో ఓ యువకుడు దిగి మృతి చెందాడు. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. కరీంనగర్ కిసాన్‌నగర్ నుంచి జలపాతాన్ని చూసేందుకు ఐదుగురు యువకులు వెళ్లారు. ఈ క్రమంలో అందులోకి దిగుతుండగా.. ప్రాణాలకి ప్రమాదకరమని అధికారులు తెలిపారు. అయిన అందులో ముగ్గురు యువకులు ఆ మాటలు పెడచెవిన పెట్టి జలపాతంలో దిగారు. కాసేపటికి వారు మునిగిపోతున్నట్లు అధికారులు గమనించి.. ఇద్దరి యువకులను సురక్షితంగా బయటకి తీశారు. మరో యువకుడైన మానుపాటి వెంకటేశ్ మాత్రం నీటిలో మునిగి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో ప్రతి చోట వాగులు, చెరువులు, కాలవలు, జలపాతాలు నీటితో నిండి ప్రమాదకరంగా మారాయని సరదా కోసం వెళ్తే.. ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని పోలీసులు హెచ్చరించారు.