రోడ్డు దాటుతూ కరెంట్ స్తంభాన్ని తాకి మహిళ మృతి.. విహార యాత్రకు వెళ్తుండగా ప్రమాదం.. - దిల్లీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
వర్షంతో తడిచిన కరెంటు స్తంభాన్ని తాకి ఓ మహిళ మృతి చెందిన ఘటన దిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే స్టేషన్‌కు వెళ్లే క్రమంలో అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని పట్టుకోవడం వల్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న దిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులతో పాటు రైల్వేశాఖతో కూడా విచారణ చేపట్టింది.
ఇదీ జరిగింది
దిల్లీ ప్రీతి విహార్‌కు చెందిన సాక్షి అహుజ అనే మహిళ ఛండీగఢ్ వెళ్లేందుకు.. ఉదయం ఐదున్నర సమయంలో మరో ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలతో కలిసి రైల్వేస్టేషన్ సమీపానికి చేరుకుంది. రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల వాటిని దాటే ప్రయత్నంలో పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని తాకింది. దీంతో షాక్‌కు గురైన ఆమె అక్కడే కుప్పకూలింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాక్షి మృతి చెందారు. ఆ కరెంటు స్తంభం వద్ద ప్లాస్టిక్ తొడుగు లేని కరెంటు వైర్లు వేలాడుతూ కనిపించాయి. సాక్షి అహుజకు ఇద్దరు పిల్లలు ఉండగా.. భర్త గురుగ్రామ్‌లోని ఓ సంస్థలో పనిచేస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది మృతురాలి సోదరి మధ్వి చోప్రా.