పింఛన్ కోసం బామ్మ పాట్లు- 2కి.మీ దూరంలోని పోస్టాఫీస్‌కు వెళ్లేందుకు 8 గంటలు శ్రమ - కర్ణాటక దావణగెరె న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Jan 10, 2024, 4:59 PM IST
Woman Crawling On Road For Pension : కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో పెన్షన్ కోసం ఓ వృద్ధురాలు 2 కిలోమీటర్లు దేకుతూ వెళ్లింది. 8గంటలపాటు శ్రమించి బోరున విలపిస్తూ పోస్టాఫీస్‌కు చేరుకుంది. ఈ క్రమంలో వృద్ధురాలి కాళ్లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు వృద్ధురాలిని హరిహర ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు.
ఇదీ జరిగింది
జిల్లాలోని నందితవెరె గ్రామానికి చెందిన గిరిజమ్మ అనే వృద్ధురాలికి గత రెండు నెలలుగా వృద్ధాప్య పింఛన్ అందట్లేదు. అప్పుడు వృద్ధురాలు కునెబెలకెరె పోస్ట్‌మ్యాన్‌ను అడిగింది. అతడు గిరిజమ్మకు దురుసుగా సమాధానం చెప్పాడు. గత రెండు నెలలుగా వృద్ధురాలి పెన్షన్ డబ్బులు రావట్లేదని చెప్పాడు. తాను బతికేందుకు జీవనాధారమైన పెన్షన్ డబ్బుల కోసం వృద్ధురాలు గిరిజమ్మ నందితవెరె గ్రామం నుంచి కునెబెలకెరె పోస్టాఫీస్‌కు మంగళవారం ఉదయం 8గంటలకు బయలుదేరి సాయంత్రం 4గంటలకు చేరుకుంది. అప్పటికే ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. ఈ విషయం అధికారుల దృష్టికి చేరడం వల్ల ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
'పింఛన్ ఎందుకు రావడం లేదని తెలుసుకునేందుకు పోస్టాఫీస్‌కు వెళ్లా. పోస్ట్‌మ్యాన్‌ను అడిగితే అతడు సరిగ్గా సమాధానం చెప్పకుండా నాపై దుర్భాషలాడాడు. ఆటోలో వెళ్లేందుకు డబ్బులు లేకపోవడం వల్ల మెల్లగా దేకుతూ పోస్టాఫీస్‌కు చేరుకున్నా. నాకు పిల్లలు లేరు. నేను ఒంటరిగా జీవిస్తున్నా' అని వృద్ధురాలు తెలిపింది.
మరోవైపు, గిరిజమ్మ తనకు పింఛన్ డబ్బులు అందలేదని కునెబెలకెరె పోస్టాఫీస్‌కు వచ్చిందని ఆశా కార్యకర్త చెప్పారు. ఈ వీడియో తహసీల్దార్ దృష్టికి చేరిందని, ఆయన గాయాలైన వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించాలని తనను ఆదేశించారని తెలిపారు.' వృద్ధురాలికి భోజనం, టిఫిన్ ఏర్పాటు చేశాను. ఆమెకు బంధువులు, పిల్లలు లేరు. ఒంటరిగా జీవిస్తోంది. ఆమె పింఛన్ సమస్యను పరిష్కరిస్తాం' అని ఆశా కార్యకర్త తెలిపారు.