కనుల పండువగా భద్రాద్రి రామయ్య వసంతోత్సవం
🎬 Watch Now: Feature Video
Bhadradri Ramaiah vasanthothsavam: భద్రాద్రి రామయ్య సన్నిధిలో మార్చి 22 నుంచి జరుగుతున్న శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు రేపటితో పూర్తి కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి వసంతోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని సీతారాములను బేడా మండపం వద్దకు తీసుకొచ్చి వసంతోత్సవ వేడుక నిర్వహించారు. ముందుగా వసంతానికి పూజలు చేసిన అర్చకులు ప్రధాన ఆలయంలోని మూలవరులకు ఉపాలయాల్లోని దేవతామూర్తులకు వసంతాన్ని చల్లి ఈ వేడుక జరిపించారు.
అనంతరం బేడా మండపంలోని సీతారాములకు రంగులు వేసి వసంతం నిర్వహించారు. తదుపరి ఆలయం నుంచి చిత్రకూట మండపం దగ్గరకు స్వామి వారిని తీసుకువచ్చి.. స్వర్ణ సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనం చేసుకోనేందుకు వీలు కల్పించారు. సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న స్వామివారికి మహిళలు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రేపు చివరి రోజు చక్రస్నానం వేడుక నిర్వహించనున్నారు. ఈనెల 6 నుంచి నిత్య కళ్యాణం పునః ప్రారంభం కానున్నాయి.