హైవేపై బస్సు- ట్రక్కు ఢీ.. అక్కడికక్కడే నలుగురు మృతి.. మరో 22 మంది ప్రయాణికులు.. - ట్రక్కు బస్సు ఢీ
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చక్కెర లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు, ఓ ప్రైవేట్ బస్సు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఆదివారం వేకువజామున రెండు గంటల ప్రాంతంలో.. పుణె- బెంగళూరు హైవేపై కత్రాజ్ ఘాట్‌లోని స్వామి నారాయణ ఆలయం సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్రక్కు క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ప్రమాదంలో అక్కడికక్కడే మరణించిన నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల నిమిత్తం.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు చెప్పారు.