Tension at Singareni : రాత్రికి రాత్రి ఆలయం నుంచి అమ్మవారి విగ్రహం తొలగింపు.. సింగరేణి ఎదుట గ్రామస్థుల ఆందోళన
🎬 Watch Now: Feature Video
Tension at Singareni : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలోని మదన పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా సింగరేణి సంస్థ తొలగించడంతో గ్రామస్థులు ఆందోళన బాట పట్టారు. అమ్మవారి విగ్రహాన్ని తొలగించిన విషయం గ్రామస్థులు ఉదయం తెలుసుకుని.. ఆర్‌జీ 3 ఓసీపీ 2 గేటు దగ్గర నిరసన తెలిపారు. మొదటి షిప్ట్‌కు సింగరేణి సంస్థలో పని చేసేందుకు వచ్చిన ఉద్యోగులను, కార్మికులను అడ్డుకున్నారు. అధిక సంఖ్యలో గ్రామస్థులందరూ ఒక్కసారిగా సింగరేణి కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సింగరేణి సంస్థ(Singareni Organization)కు తమ ఇళ్లను, స్థలాలను ఇచ్చి సహకరించామని.. గ్రామ దేవత విగ్రహాన్ని తొలగించడం ఎంత వరకు న్యాయమని అధికారులను ప్రశ్నించారు. గ్రామానికి ఎలాంటి పీడలు రాకుండా ఏర్పాటు చేసుకున్న మదన పోచమ్మ దేవాలయంలోని విగ్రహాన్ని శ్రావణ మాసంలో తీసి వేయడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి ఏదైనా కీడు జరిగితే దానికి సింగరేణి సంస్థ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సంస్థ అభివృద్ధికి దేవాలయాన్ని ఇవ్వలేదని ఆరోపించారు. ఎలాంటి సమాచారం లేకుండా విగ్రహాన్ని తొలగించడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు. వెంటనే గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.