Sabitha IndraReddy fires on Botsa : "ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిపై చర్చకు సిద్ధం" - రంగారెడ్డి జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
Sabitha IndraReddy fires on Botsa satyanarayana : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి గురించి మాట్లాడానికి తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రాన్ని, వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. లేకుంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పబ్లిసిటీ కోసమో, పదిమంది మెప్పు కోసమో మాట్లాడమని.. ఒక విజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కేజీ టు పీజీ విధానంతో విద్యావ్యవస్థను పటిష్ఠంగా అమలుపరుస్తున్నారన్నారు. స్వరాష్ట్రంలో రెండుసార్లు ఉపాధ్యాయ బదిలీలు అయ్యాయని.. అది తెలియక మంత్రి తప్పుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కొంతమంది ఉపాధ్యాయులు కోర్టుకు పోవడం వలన తాజా బదిలీలు ఆగిపోయాయని.. విషయం తెలుసుకోక తప్పుగా మాట్లాడడం సరికాదని మంత్రి సూచించారు.
ఏపీ మంత్రి బొత్స ఏమన్నారంటే.. విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా మంత్రి మాట్లాడారు.‘‘ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు. అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి’’ అని బొత్స వ్యాఖ్యానించారు.