SRSP Water Level Update : ఎగువ నుంచి కొనసాగుతున్న వరద.. ఎస్సారెస్పీలో పెరుగుతున్న నీటినిల్వ - పెరుగుతున్న వరద నీరు
🎬 Watch Now: Feature Video
Sri Ramsagar Project Water Level : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 19,269 క్యూసెక్కుల వరద చేరగా.. గోదావరి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా 2,900 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1070.30 అడుగుల నీటిమట్టంతో.. 29.509 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అయితే శ్రీరాంసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. మొత్తం ఇక్కడ 42 గేట్లు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో శ్రీరాంసాగర్‌కు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలించేందుకు శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని వెనక్కి తీసుకువచ్చి.. వరద కాలువ ద్వారా నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు మళ్లిస్తున్నారు. ఎస్సారెస్పీ వరద కాల్వపై మూడు పంపుహౌజ్‌లు నిర్మించారు. వరద కాలువ 73 కిలోమీటర్ల వద్ద రాంపూర్, 34 కిలోమీటర్ల వద్ద రాజేశ్వర్రావు పేట, 0.1 కిలోమీటర్ల వద్ద ముప్కాల్ పంపుహౌజ్‌లు నిర్మించారు. అలాగే ఒక్కో పంపుహౌజ్‌లో 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎనిమిది చొప్పున మోటార్లు బిగించారు.