Special Story on CM KCR Adopted Village Vasalamarri : కేసీఆర్ దత్తత గ్రామం 'వాసాలమర్రి' గుర్తుందా.. ప్రస్తుతం ఎలా ఉందో మీరే చూడండి - తెలంగాణ వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 24, 2023, 2:03 PM IST
Special Story on CM KCR Adopted Village Vasalamarri in Yadadri Bhuvanagiri : ఒకప్పుడు ఆ గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. గ్రామ పరిస్థితిని చూసి ముఖ్యనేత దత్తత తీసుకోవడంతో రూపురేఖలు మారిపోయాయి. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ భవనాలు.. ఇలా అనేక నూతన భవనాలకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో వాటి నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఇళ్లు, ఇతర నిర్మాణాలకు సైతం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మోడల్ విలేజ్‌గా రూపుదిద్దుకుంటున్న ఆ గ్రామాన్ని చూద్దాం రండి..
Vasalamarri Village Special Story : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఒకప్పుడు కనీస సదుపాయాలు లేవు. సీఎం కేసీఆర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో అధికారులు గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే నిధులు మంజూరు కావడంతో ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ హైస్కూల్, మూడు అంగన్వాడీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ భవనాలను నిర్నిస్తున్నారు. అంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు స్లాబ్ వరకు పూర్తయ్యాయి. 33/11 కేవీ నూతన విద్యుత్ ఉపకేంద్రం పూర్తి చేసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రిని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయని.. 76 మందికి పైగా దళితబంధు వచ్చిందని.. కేసీఆర్ వలనే తమ గ్రామం ఆదర్శ గ్రామంగా మారిందని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో పెంకుటిళ్లు, కచ్చా ఇళ్లను తొలగించి.. అర్హులైన వారికి గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. త్వరగా నిర్మించి గృహాలు ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.