Seventh Session of GHMC Council Meeting : వాడివేడిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. ప్రతిపక్షాల నిరసన
🎬 Watch Now: Feature Video
Published : Aug 23, 2023, 7:42 PM IST
GHMC Council Meeting Today : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్హాల్లో నిర్వహించిన సమావేశంలో.. బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సుమారు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అభివృద్ధి పనులు, ప్రొటోకాల్ వివాదం, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, నాలాల అభివృద్ధి, రెస్క్యూ టీమ్‌లపై పోటాపోటీగా చర్చించారు. సమావేశానికి ముందు బీజేపీ కార్పొరేటర్లంతా పారిశుద్ధ్య కార్మికుల అవతారమెత్తి చెత్త డబ్బాలు, ట్రాక్టర్ బొమ్మలతో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో అప్పుల్లో ఉన్న జీహెచ్ఎంసీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం మూడున్నర గంటలపాటు సాగింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలకు బానిసలుగా మారారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించగా.. మేయర్ జోక్యం చేసుకొని వాగ్వాదాన్ని చల్లార్చారు. అలాగే ప్రొటోకాల్ విషయంలో ఎమ్మెల్యేలు, అధికారులు.. కార్పొరేటర్లను విస్మరిస్తున్నారన్న సభ్యుల ఫిర్యాదుతో ఏకీభవించిన మేయర్.. ఈ విషయాన్ని ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగ భద్రత, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.