'ప్రగతి అంటే ఏమిటో రేవంత్ పాలనలో ప్రజలకు అర్థమవుతుంది'
🎬 Watch Now: Feature Video
Published : Dec 6, 2023, 4:04 PM IST
Revanth Reddy Native Villagers Celebrations : రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం పట్ల ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో నరసింహారెడ్డి - రామచంద్రమ్మ దంపతులకు రేవంత్ ఐదో సంతానంగా 1968లో జన్మించారు. ఏటా దసరా పండుగకు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తన స్వగ్రామానికి వస్తుంటారు. ఈ ఏడాది దసరా వేడుకల్లోనూ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా ప్రకటించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టిన తర్వాతే పార్టీ పరుగులు పెట్టిందని, ఆయన ముఖ్యమంత్రి అవుతారని ముందుగానే ఊహించామని గ్రామస్తులు చెప్పుకొచ్చారు.
Telangana CM Revanth Reddy : నల్లమల బిడ్డ సీఎం కావడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని, ప్రగతి అంటే ఏమిటో రేవంత్ పాలనలో ప్రజలకు అర్థమవుతుందని ఆయన సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఎప్పుడు గ్రామానికి వచ్చినా అక్కడి అంజనేయ స్వామి దేవస్థానాన్ని తప్పకుండా దర్శించుకుంటారని, రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత రేవంత్‌కు అంతా మంచే జరుగుతుందని గ్రామస్తులు ఆకాంక్షించారు.