Puri Rath Yatra 2023 : పూరీలో జగన్నాథ రథయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు.. ప్రత్యేక రైళ్లు
🎬 Watch Now: Feature Video
Puri Rath Yatra 2023 : ప్రఖ్యాత జగన్నాథుని రథయాత్ర నేపథ్యంలో పూరీ నగరమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల కోలాహలం మధ్య ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి రథాల్లో చేరుకుంటారు. ఈ ఊరేగింపునకు నందిఘోష్ (జగన్నాథుడి రథం), తాళధ్వజ (బలభద్రుడిది), దర్పదళన్ (సుభద్ర) రథాలు సిద్ధమయ్యాయి. జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. మరో అద్భుత శిల్పాన్ని పూరీ సముద్రతీరం వెంబడి తీర్చిదిద్దారు. 250 కొబ్బరికాయలతో 6 అడుగుల ఎత్తైన జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడి విగ్రహాలకు ప్రాణం పోశారు. వాటి వెనుక జగన్నాథ రథాలను ఏర్పాటు చేశారు. చరిత్రలో దాసియా బౌరి అనే భక్కుడు.. స్వామి వారికి కొబ్బరికాయలు సమర్పించుకున్న ఘట్టానికి గుర్తుగా శిల్పాన్ని తీర్చిదిద్దినట్లు సుదర్శన్ తెలిపారు.
మరోవైపు రథయాత్ర నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది ప్రభుత్వం. భక్తులు వచ్చేందుకు వీలుగా 125 ప్రత్యేక రైళ్లను వేసింది. 180 దళాలతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సారి 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చీఫ్ సెక్రటరీ పీకే జెనా తెలిపారు. ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, సుఖ సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.