వామ్మో సైకో..! వందల మందిని వణికించాడుగా.. పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ ధ్వంసం - kurnool district news
🎬 Watch Now: Feature Video
Psycho weapon : చుట్టూ వందల మంది జనం... అక్కడే పోలీస్ స్టేషన్.. పదుల సంఖ్యలో పోలీసులు ఉన్నా అతడిని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ వణికిపోయారు. దగ్గరకు వస్తే దూరంగా పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తికి మతి స్థిమితం లేకపోగా, అతడి చేతిలో ఇనుప రాడ్ ఉండడమే అందుకు కారణం.
కర్నూలు జిల్లా పత్తికొండలో మతిస్థిమితం లేని వ్యక్తి ఇనుపరాడితో హల్చల్ చేశాడు కనపడిన వాహనాలను ధ్వంసం చేస్తూ భయభ్రాంతులకు గురి చేశాడు. వాహనాలను ధ్వంసం చేస్తున్నా.. స్థానికులు చూస్తూ భయంతో నిలిచిపోయారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగినా పోలీసులు సైతం అతడిని పట్టుకునేందుకు ముందుకు రాకపోవడంతో ఆ వ్యక్తి మరింతగా రెచ్చిపోయాడు. బస్సులు, కార్ల అద్దాలు పగులు కొడుతూ తనను ఫొటోలు, వీడియోలు తీస్తున్న వారిపైనా దాడికి పాల్పడ్డాడు. ఓ వ్యక్తిని పట్టుకొని చితకబాదాడు. అరగంట సేపు ఆ వ్యక్తి కోర్టు, పోలీస్ స్టేషన్ సర్కిల్లోనే హల్చల్ చేయడంతో పాటు నేరుగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి వస్తువులను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో స్థానిక యువకులు లోపలికి చొరబడి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
దాడికి పాల్పడిన వ్యక్తి పేరు వన్నూరు వలి. పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన అతడికి మతిస్థిమితం లేని కారణంగా మొదటి భార్య వదిలిపెట్టింది. రెండో వివాహం చేసినా అదే పరిస్థితి కొనసాగడంతో ఆమె సైతం వదిలిపెట్టి వెళ్లినట్టు సమాచారం. దీంతో అప్పుడప్పుడూ ఇలా మతిస్థిమితం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. దాడిలో బస్సు, రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అడ్డుగా వచ్చిన బస్సు డ్రైవర్, మరో ముగ్గురిపై దాడికి పాల్పడ్డాడు. చివరకు నిందితున్ని పట్టుకుని స్థానికులు పోలీస్ స్టేషన్లో అప్పగించారు.