పుట్ట మధుతో మాకు ప్రాణహాని ఉంది.. మహిళా ఎంపీపీ కన్నీటి పర్యంతం - మహిళా ఎంపీపీ తిట్టిన జడ్పీ ఛైర్మన్
🎬 Watch Now: Feature Video
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుతో తమకు ప్రాణగండం ఉందని రామగిరి మహిళా ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ దంపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండ్రోజుల క్రితం పుట్ట మధు తమను పెద్దపల్లి జడ్పీ కార్యాలయానికి పిలిపించి తలుపులు వేసి బెదిరించి, బూతులు తిట్టాడని వారు ఆరోపించారు. వామన్‌రావు దంపతుల హత్య నడిరోడ్డుపై ఎలా జరిగిందో తెలుసు కదా.. పుట్ట మధు అంటే తెలియదా..? అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌కు ఫిర్యాదు చేస్తామని ఎంపీపీ అనగా.. కేసీఆర్, కేటీఆర్ ఎవరు.. అన్నీ నేనే ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు.
జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, కమాన్‌పూర్ మార్కెట్ మాజీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్‌తో ప్రాణ గండం ఉందని, దీనిపై రామగుండం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని ఎంపీపీ దంపతులు వివరించారు. పుట్ట మధు తమను తిట్టిన, బెదిరించిన ఆడియో రికార్డు సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు వినిపించి ఫిర్యాదు చేస్తామన్నారు. మండలంలో ఏ పనులు చేయకుండా అడ్డుపడుతున్నారని మహిళా ఎంపీపీ కన్నీళ్లు పెట్టుకున్నారు.