Building collapsed in Quthbullapur : బెడిసికొట్టిన ప్రయత్నం.. మరో ఇంటిపై ఒరిగిన భవనం - ప్రమాదవశాత్తు పక్కనున్న భవనంపైకి ఒరిగిన భవనం
🎬 Watch Now: Feature Video

Old Building Demolish At Quthbullapur : జాకీలతో ఇంటి ఎత్తును పెంచాలన్న ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆ భవనం మరో ఇంటిపై ఒరగడంతో అందులో నివాసం ఉంటున్న వారు ప్రాణభయంతో బయటికి పరుగులు పెట్టారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన నర్సింహారావు.. 25 సంవత్సరాల క్రితం జీ ప్లస్ 2 విధానంలో ఇంటిని నిర్మించారు. ప్రస్తుతం అక్కడ రోడ్డు ఎత్తు పెరగడంతో.. వర్షం కురిసిన ప్రతిసారి వారి ఇంట్లోకి వరద నీరు ప్రవేశిస్తోంది. తెలిసిన వారి సూచనల మేరకు ఇంటి ఎత్తును పెంచాలని అనుకున్నాడు. దీనికి సంబంధించి చర్యలు చేపట్టాడు.
ఈ పనులను ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన ఓ గుత్తేదారుకు అప్పగించాడు. ఆ భవనంలో మొత్తం యజమాని కుటుంబం సహా ఆరు కుటుంబాలు ఉంటున్నాయి. బిల్డింగ్ మరమ్మతుల ప్రక్రియ మొదలైన తర్వాత రెండు కుటుంబాలు ఖాళీ చేయగా.. మరో రెండు కుటుంబాల వారు సమీపంలోని తెలిసిన వారి ఇళ్లకు ఛేంజ్ అయ్యారు. యజమాని కుటుంబంతో పాటు మరో కుటుంబీకులు అందులోనే ఉంటున్నారు. ఇంటిని ఎత్తు పెంచేందుకు వినియోగించిన హైడ్రాలిక్ జాకీలు అదుపు తప్పడంతో ఒక్కసారిగా ఆ భవనం పక్కనున్న మరో భవనంపైకి ఒరిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం భద్రతా చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా మరమ్మతులు చేపట్టిన ఇంటి యజమాని నర్సింహాారావుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పక్కకు ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించామని.. కూల్చివేత పనులను నేడు చేపట్టనున్నామని అధికారులు తెలిపారు.