భగవద్గీతను ఉర్దూలోకి అనువదించిన ముస్లిం- మన బోధన్ అమ్మాయే! - నిజమాబాద్ అమ్మాయి భగవద్గీతను ఉర్దూలోకి అనువాదం
🎬 Watch Now: Feature Video
Published : Dec 14, 2023, 5:17 PM IST
Muslim Girl Translated Bhagavad Gita In Urdu : హిందూ మతం గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో భగవద్గీత చదివింది ఓ ముస్లిం అమ్మాయి. చదవడమే కాకుండా ఆ గ్రంథాన్ని ఉర్దూలోకి అనువదించింది. వచ్చే ఏడాది ఆమె అనువదించిన ఉర్దూ భగవద్గీత ప్రచురితం కానుంది. తెలంగాణ నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణానికి చెందిన హెబా ఫాతిమా భగవద్గీతను ఉర్దూలోకి అనువదించి ప్రత్యేక గుర్తింపు పొందింది. హిందూ మతపరమైన ఆచారాలపై ఉన్న ఆసక్తి తనను మొదటిసారి గీతను చదివేలా చేసిందని ఫాతిమా చెబుతోంది.
"ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోని తెలంగాణలో నేను నివసిస్తున్నాను. మా పక్కన కొంతమంది హిందువులు ఉండేవారు. నేను వాళ్లతో మాట్లాడినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగేదానిని. మీరు ఎంతమంది దేవుళ్లను ఆరాధిస్తారు అని ఓసారి అడిగాను. అప్పుడు నాకు వాళ్ల దగ్గర నుంచి రకరకాల సమాధానాలు వచ్చేవి. అయితే ఎవరైనా ఏదైనా మతం గురించి తెలుసుకోవాలంటే వాళ్ల మత గ్రంథాలను చదవాలని ఎవరో అంటుంటే విన్నాను. అందుకే నేను భగవద్గీతను చదవడం ప్రారంభించాను"
- హెబా ఫాతిమా
భగవద్గీతను చదివేందుకు ఫాతిమా చేసిన ప్రయత్నానికి ఆమె కుటుంబం మద్దతుగా నిలిచింది. ఫాతిమా తండ్రే స్వయంగా ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. "నేను ఉర్దూ మీడియంలో చదువుకుంటున్నాను. తెలుగు, హిందీ భాషల్లో ఉన్న భగవద్దీతలను నాన్నా కొని తెచ్చారు. మొదట్లో నేను చదవడానికి ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత నేను ఆంగ్లంలో ఉన్న భగవద్గీతను డౌన్లోడ్ చేసి చదవడం ప్రారంభించాను. అయితే గీతను ఉర్దూలోకి అనువదించినా కొన్నిసార్లు చదవడంలో ఇబ్బందిపడుతున్నాను. భగవద్గీతను అర్ధం చేసుకుని తెలుసుకోడమే నా ఉద్దేశ్యం" అని హెబా ఫాతిమా తెలిపింది. మతసామరస్యానికి హెబా ఫాతిమా ఉదాహరణగా నిలుస్తోంది. హిందువులు, ముస్లింలతో ప్రశంసలు అందుకుంటోంది.