Minister Harish Rao Speech at Council : 'ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో.. హైదరాబాద్ హెల్త్ హబ్‌గా మారింది'
Minister Harish Rao Speech at Council: రాష్ట్రంలో గత ప్రభుత్వాలు వైద్యాన్ని నిర్లక్ష్యం చేశాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శాసన మండలిలో ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రస్తుతం కొత్తగా 10 వేల పడకలను రాష్ట్రంలో నలుమూలల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఐటీ హబ్, ఫార్మా హబ్, వ్యాక్సిన్ హబ్‌గా ఉన్న హైదరాబాద్.. హెల్త్ హబ్‌గా మారిపోయిందని తెలిపారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోకాళ్ల నొప్పులకు రీప్లేస్మెంట్ చేస్తున్నామన్నారు. కిడ్నీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నామని, దేశంలో అత్యధిక ట్రాన్స్ ప్లాంటేషన్ హైదరాబాద్‌లో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎయిమ్స్ తరహాలో టిమ్స్‌కు కూడా ఒక్కోదానికి ఒక్కో డైరెక్టర్ ఉంటారని.. రూ.156 కోట్లతో రోబోటిక్ యంత్రాన్ని, 150 వెంటిలేటర్లను సమకూర్చుకున్నామని తెలిపారు. ధాన్యం రంగంలో తెలంగాణ నంబర్ వన్‌గా మారిందని.. దేశానికి వైద్యులను అందించడంలోనూ తెలంగాణ నంబర్ వన్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వైద్యుల వరకు అందిస్తున్న సేవల పట్ల శాసనమండలి సంతృప్తి తెలుపుతూ ప్రశంసల జల్లులు కురిపించింది. సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో మంత్రి హరీశ్‌రావు తెలంగాణ వైద్యారోగ్య శాఖను దేశంలో నెంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నారని కొనియాడింది.