వెడ్డింగ్ ప్లానర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు కూలీలు సజీవదహనం
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలోని పుణెలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరానికి చెందిన ఓ వెడ్డింగ్ ప్లానర్ గోదాంలో మంటలు చెలరేగడం వల్ల ముగ్గురు కార్మికులు సజీవ దహనమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలోని ఉబలేనగర్లో ఉన్న శుభ్ సజావత్ వెడ్డింగ్ ప్లానర్ గోదాంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలిలో ఉన్న నాలుగు సిలిండర్లు పేలిపోయాయి. పేలుడు శబ్దాలకు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు తమ ఇంటి నుంచి పరుగులు తీశారు. అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది.. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తొమ్మిది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఘటనా స్థలంలో ముగ్గురు కార్మికుల మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మంటలకు వారు సజీవదహనమైనట్లు చెప్పారు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.