గన్‌తో క్లాస్‌లో హల్చల్.. 80 మంది విద్యార్థులు హడల్.. చివరకు..
🎬 Watch Now: Feature Video
తుపాకీతో ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించిన ఓ దుండగుడు విద్యార్థులను తరగతి గదిలో బంధించి భయభ్రాంతులకు గురిచేసిన ఘటన బంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో జరిగింది. తన భార్యను, కుమారుడిని ఎవరో అపహరించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ అతడు బీభత్సం సృష్టించాడు. విద్యార్థులను చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు.
దేవ్ వల్లభ్ అనే వ్యక్తి తన భార్య రీటా వల్లభ్, కుమారుడు రుద్ర వల్లభ్ కనిపించట్లేదని ఏడాది క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయినా వారు పట్టించుకోకపోవడం వల్ల దేవ్ పాఠశాల కిటికీ నుంచి తరగతిలోకి ప్రవేశించాడు. పాఠాలు చెబుతుండగా వచ్చిన ఆ వ్యక్తి బ్యాగు నుంచి పిస్టోల్ బయటకు తీసి బెదిరింపులకు దిగాడని టీచర్ తెలిపారు. తొలుత అది బొమ్మ తుపాకీ అనుకున్నట్లు వివరించారు. ఆ సమయంలో తరగతిలో 80 మంది విద్యార్థులు ఉన్నారని.. వారు భయంతో ఏడుస్తుంటే చంపుతానని బెదిరించినట్లు చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. దీంతో ఘటనా స్థలిలో ఉన్న అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ చర్యకు పాల్పడిన దేవ్ వల్లభ్ ముచ్చియాలోని నెమువా గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతడి భార్య రీటా వల్లభ్ మాల్దా గ్రామ పంచాయతీ సమితికి చెందిన బీజేపీ సభ్యురాలు. తన భార్య, కుమారుడిని ఎవరో అపహరించారంటూ.. వారిని వెతికి పెట్టాల్సిందిగా కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టాడు వల్లభ్. అంతేకాకుండా పిస్టల్‌తో అధికారులను బెదిరిస్తున్నట్లుగా వీడియో షేర్ చేశాడు. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు దేవ్ వల్లభ్. మొత్తంగా కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్ల అతడు కొంత మానసికంగా కుంగిపోయాడని పోలీసులు చెప్పారు.