10,000 మందికి పైగా రైతులతో లాంగ్ మార్చ్.. ఆ డిమాండ్లతోనే.. - మహారాష్ట్ర రైతుల నిరసన
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలో రైతులు కదం తొక్కారు. 10 వేల మందికి పైగా కలిసి దాదాపు 200 కిలోమీటర్లు లాంగ్ మార్చ్ చేపట్టారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దిండోరి నుంచి ముంబయి వరకు ఈ పాదయాత్ర జరుగుతోంది. ఆదివారం ప్రారంభమైన ఈ పాదయాత్ర నాలుగు రోజులుగా కొనసాగుతోంది. భారత కమ్యూనిష్ట్ పార్టీ (మార్కిస్ట్) అధ్వర్యంలో ఈ లాంగ్‌మార్చ్ జరుగుతోంది. ఈ పాదయాత్రలో రైతులు, రైతుకూలీలు, గిరిజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మార్చి 20న ఆ యాత్ర ముంబయికి చేరే అవకాశం ఉంది. నష్టపోయిన ఉల్లి రైతులకు క్వింటాల్‌కు రూ. 600 తక్షణ ఆర్థిక సాయాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయానికి 12 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే మరో డిమాండ్ చేస్తున్నారు. సోయాబీన్, పత్తి ధరల పతనాన్ని అరికట్టడానికి.. చర్యలు తీసుకోవాలని ఇటీవల అకాల వర్షాల వల్ల నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని రైతులు కోరారు. రుణమాఫీ సహా మరిన్ని డిమాండ్‌లను రైతులు ప్రభుత్వం ముందు ఉంచారు. కమోడిటీ ధరల విపరీతమైన పతనంతో తీవ్రంగా నష్టపోయిన ఉల్లి రైతులకు క్వింటాకు 300 రూపాయల చెల్లిస్తామని శిందే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.