Land Issue Complaint on Minister Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్ నుంచి ప్రాణహాని ఉందంటూ అంధుడి ఆవేదన - భూని కబ్జా చేశారంటూ మంత్రి గంగులపై ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
Published : Oct 10, 2023, 5:29 PM IST
Land Issue Complaint on Minister Gangula Kamalakar : తెలంగాణ బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ... బాధిత అంధుడు, అతని భార్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేడుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రోద్భలంతో... అతని అనుచరులు మహిపాల్, కర్ర రవీందర్‌రెడ్డిలు తన భూమి కబ్జా చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలని మంత్రి వద్దకు వెళ్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని... వారికి భయపడి హైదరాబాద్‌లో తలదాచుకున్నానని బాధిత అంధుడు చెట్టి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితుడు మాట్లాడుతూ... తాను 2007లో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ పంచాయితీలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఎకరం భూమిని కొనుగోలు చేశానన్నారు. ఇటీవల కుటుంబ అవసరాల కోసం 10 గుంటల ఆస్తిని విక్రయించానని పేర్కొన్నారు. మిగిలిన 35 గుంటల భూమిను కబ్జా చేసి... అక్రమకట్టడాలు నిర్మించారని వాపోయాడు. రూ.4 కోట్ల విలువ చేసే తన భూమిలోకి వచ్చి ఇబ్బందులు కలిగిస్తుంటే వారిని రానివ్వకుండా కోర్టులో 2021లో కేసు వేశానన్నారు. తన భూమిని వదులుకోవాలని రూ.30 లక్షల ఇస్తామని మంత్రి హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు చెప్పినట్లు వినకపోతే తనతో పాటు కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించారని వాపోయారు. ఈ విషయంపై కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని... ఎస్సై ఎల్లయ్య గౌడ్ రూ.10లక్షల డిమాండ్ చేశారని ఆరోపించారు. తన ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కొనుగోలు చేసిన... తన భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపి తక్షణమే తన భూమి ఇప్పించి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను వెంకట రమణ వేడుకున్నారు.