'హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా - 24 గంటలూ తాగు నీరు అందించాలన్నదే మా లక్ష్యం, స్వప్నం' - హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video
Published : Nov 11, 2023, 3:21 PM IST
KTR Comments on Hyderabad Development : దేశంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఉమ్మడి ఏపీలో విద్యుత్, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉండేదన్న ఆయన.. గతంలో తరచూ విద్యుత్ కోతలు, తాగు నీటి కోసం నిరసనలు జరిగేవని గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా భాగ్యనగరం సహా రాష్ట్రవ్యాప్తంగా తాగు నీటి సమస్య లేకుండా చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో 24 గంటలు తాగు నీటిని అందించాలన్నదే తమ స్వప్నమని కేటీఆర్ పేర్కొన్నారు. పెట్టుబడులు తేవడం, మౌలిక వసతులు కల్పిస్తేనే విశ్వనగరం సాధ్యమని తెలిపారు. మెట్రో రైలు సేవలు 70 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నామన్న ఆయన.. మెట్రోను రాబోయే 7 నుంచి 10 ఏళ్లలో 415 కిలోమీటర్లు విస్తరించాలన్నదే తన ఎజెండా అన్నారు. చెత్త సేకరణలో మరింత సమర్థ నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి.. పురపాలనలో రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో పౌరుల భాగస్వామ్యం కల్పించే బాధ్యత తనదని స్పష్టం చేశారు.