జ్యోతిర్లింగంపై కరెన్సీ నోట్లు విసిరిన మహిళ.. ఆలయ కమిటీ ఆగ్రహం - kedarnath jyotirlinga
🎬 Watch Now: Feature Video
పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగంపై ఓ మహిళ నోట్లు విసరడం వివాదాస్పదమైంది. మహిళ నోట్లు విసురుతున్న సమయంలో ఆమె పక్కన కొందరు భక్తులు కూడా ఉన్నారు. అయితే వారు ఆ మహిళను, అడ్డుకోకపోగా.. మంత్రాలు పఠించడం చర్చనీయాంశంగా మారింది. గర్భగుడిలో మహిళ ప్రవర్తించిన తీరుపై పలువురు మండిపడుతున్నారు. కాగా ఆ మహిళ ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆ మహిళపై విచారణ జరిపించాలని ఆలయ కమిటీ అధికారులు.. రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్, సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు, కేదార్‌నాథ్ ఆలయానికి బంగారు తాపడం చేయించే ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని ఆలయ కమిటీ కొట్టిపారేసింది. ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే కొందరు వ్యక్తులు ప్రత్యేకంగా పనికట్టుకొని ఇలాంటి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కమిటీ ఛైర్మన్ మండిపడ్డారు. ఆలయ తాపడం పనులు అన్నీ కూడా దాతల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.