'చేపను పట్టుకున్నా.. గుడిలోకి వెళ్లొచ్చా?'.. రాహుల్​ డౌట్ - చేపను పట్టుకున్న రాహుల్​ గాంధీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 28, 2023, 4:05 PM IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సంఘటన జరిగింది. గురువారం ఉడుపి జిల్లాలోని కాపు నియోజకవర్గంలో.. రాహుల్​ మత్స్యకారులతో సమావేశమయ్యారు. అనంతరం మత్స్యకారులపై హామీల వర్షం కురిపించారు. కొందరు గంగపుత్రులు రాహుల్‌కు అన్జల్‌ అనే చేపను బహూకరించారు. ఆ చేపను పట్టుకుని రాహుల్‌ గాంధీ ఆనందం వ్యక్తం చేశారు. ఆ సమయంలో రాహుల్​తో  మత్స్యకారులు.. ఫొటోలు సైతం తీసుకున్నారు.

కార్యక్రమం ముగిసిన అనంతరం రాహుల్​ గాంధీ నేరుగా.. ఉచిల మహాలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. కాకపోతే ఆ మందిరంలోకి వెళ్లేందుకు ఆయన సంకోచించారు. తాను చేపను పట్టుకున్నానని, చేతులు కడుక్కోలేదని.. అయినా ఆలయం లోపలకు రావచ్చా? అంటూ అక్కడున్న వారిని అడిగారు. వారు ఏం కాదని.. లోపలకు రమ్మని చెప్పారు. అయినా రాహుల్​ గాంధీ కొద్ది సేపు బయటే ఉండిపోయారు. తర్వాత ఆలయ పూజారులు, కాంగ్రెస్‌ శ్రేణులు ఆయన్ను ఆలయం లోపలికి తీసుకెళ్లారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి.. రాహుల్​కు ప్రసాదం అందించారు.  

ఈ సారి కర్ణాటకలో ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ​.. తీవ్ర స్థాయిలో కృషి చేస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు కొత్త పథకాలను ప్రజల ముందు ఉంచుతోంది. కర్ణాటకలో 224 శాసనసభ స్థానాలకుగానూ ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 10న పోలింగ్ జరగనుండగా.. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. అధికారం కోసం బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నువ్వా-నేనా అన్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.