ప్రార్థనా మందిరం కూల్చివేతకు నోటీసులు.. పోలీసులపై 500 మంది రాళ్ల దాడి..
🎬 Watch Now: Feature Video
Junagadh Violence : గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉన్న ఓ ప్రార్థనా మందిరానికి మున్సిపల్ అధికారులు జారీ చేసిన నోటీసులు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ప్రార్థన మందిరాన్ని అక్రమంగా నిర్మించారని అందుకే కూల్చివేతకు నోటీసులు జారీ చేస్తున్నట్టు పేర్కొన్న మున్సిపల్ అధికారులు.. 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నిర్వహకులను కోరారు. ప్రార్థనా మందిరం కూల్చివేతకు నోటీసులు ఇవ్వడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులుతో పాటు పోలీసులు వెళ్లడం వల్ల అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో 500-600 మంది ఓ వర్గానికి చెందిన నిరసనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. అలాగే పలు వాహనాలకు నిప్పంటించారు. నిరసనకారుల దాడిలో ఓ పౌరుడు మరణించగా.. కొందరు పోలీసుల సైతం గాయపడ్డారు. దీంతో పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. శుక్రవారం రాత్రి జరిగిందీ ఘటన.
'నిరసనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించాం. వారిని ఆపేందుకు ప్రయత్నించినా పోలీసులపై రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పంటించారు. దీంతో వారిపై లాఠీఛార్జ్ చేశాం. నిరసనకారుల రాళ్ల దాడి వల్ల ఒక పౌరుడు మరణించాడు. శుక్రవారం రాత్రి సమయంలో నిరసనకారులు రెచ్చిపోయారు. 174 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నాం' అని జునాగఢ్ ఎస్పీ రవితేజ తెలిపారు.