ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపట్టాం - అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు - Congress Government in Telangana
🎬 Watch Now: Feature Video
Published : Dec 17, 2023, 3:33 PM IST
IT Minister Sridhar Babu on Congress Governance : కాంగ్రెస్ పాలన పూర్తి ప్రజాస్వామ్యబద్దంగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గొంతుకకు స్వేచ్ఛ ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రజలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. హైదరాబాద్ నుంచి మంథని వెళ్తున్న క్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా, ఆదర్శంగా నిలుపుతామన్నారు. రాబోయే కాలంలో వ్యవసాయ రంగంలో, ఉపాధి రంగంలో, ఐటీ పరిశ్రమల రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచే కార్యాచరణ రూపొందించి అమలు పరుస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని, గత ప్రభుత్వ పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే వాటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పిన మేనిఫెస్టో, ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడతామన్నారు. రాబోయే బడ్జెట్లో ప్రణాళికాబద్ధంగా అన్ని రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ రూపొందిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ను అమలు పరిచి, ప్రభుత్వంలో ఉన్న అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.