వినూత్నంగా రెజ్లర్ల నిరసన.. రోడ్లపైనే కుస్తీ.. పతకాలు తేవాల్సిన బాధ్యత ఉందంటూ.. - జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల వ్యాయామం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18349042-thumbnail-16x9-wrestlers.jpg)
రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా అగ్రశ్రేణి రెజ్లర్లు వినూత్నంగా నిరసన చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుత ఆందోళన చేస్తున్న రెజ్లర్లు.. వ్యాయామం చేస్తూ తమ ఆందోళన కొనసాగించారు. రహదారిపైనే కుస్తీలు పడుతూ రెజ్లింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలో రెజ్లర్ బజరంగ్ పునియా మీడియాతో మాట్లాడాడు. ఓ వైపు శాంతియుతంగా నిరసనలు తెలుపుతూనే మరో వైపు వ్యాయామం చేస్తున్నామని అన్నాడు. దేశానికి పతకాలు సాధించే బాధ్యతను ప్రజలు తమకు ఇచ్చారని, దానిని నెరవేర్చాల్సిన అవసరం కూడా తమపైనే ఉందని తెలిపాడు. దిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని కూడా పునియా చెప్పాడు. అందువల్ల తాము ఈ తరహాలో నిరసలను చేస్తున్నామని తెలిపాడు. ఇక ఈ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేదేలేదని రెజ్లర్లు ముక్తకంఠంతో స్పష్టం చేశారు.
'ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదంటే..'
మరోవైపు, ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై దిల్లీ పోలీసులు.. సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ అవసరమని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే నమోదు చేయాలని సుప్రీంకోర్టు భావిస్తే.. వెంటనే ఆ ఆదేశాలు పాటిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో స్పందించిన సుప్రీంకోర్టు.. ఏప్రిల్ 28న రెజ్లర్ల అభ్యర్థనను విచారించే సమయంలో దిల్లీ పోలీసులు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని పేర్కొంది.
డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై దిల్లీ పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ రెజ్లర్లు మరోసారి ఆందోళనబాట పట్టారు. ఆదివారం నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఆయనపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల రెజ్లర్లు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును పరిశీలించిన సుప్రీం కోర్టు.. దిల్లీ పోలీసులతో పాటు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 28న దీనిపై విచారణ జరగనుంది.