నడిసంద్రంలో చైనా వ్యక్తికి కార్డియాక్ అరెస్ట్.. భారత్ డేరింగ్ ఆపరేషన్.. చిమ్మచీకట్లోనే.. - ఇండియన్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ వీడియో
🎬 Watch Now: Feature Video
Indian Coast Guard Evacuates Chinese National : నడి సుమద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ డేరింగ్ అపరేషన్ చేపట్టింది. అరేబియా సముద్రంలో ఓ నౌకలో ప్రయాణిస్తున్న చైనా పౌరుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆ నౌక సిబ్బంది ముంబయిలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌కు అత్యవసర సందేశం పంపారు. దీంతో రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డ్.. బాధితుడిని సురక్షింతంగా తీరంలోని సమీప ఆస్పత్రికి తరలించింది.
ఇదీ జరిగింది..
పనామా జెండాతో ఉన్న ఎంవీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ నంబర్ 2 రీసర్చ్ నౌక.. చైనా నుంచి అరేబియా సముద్రం మీదుగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్- యూఏఈకి వెళ్తోంది. బుధవారం రాత్రి ఈ నౌకలో పనిచేస్తున్న సిబ్బంది యిన్ వీగ్‌యాంగ్ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. ఛాతినొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో నౌక సిబ్బంది సమీప తీర ప్రాంతమైన ముంబయిలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌కు మెడికల్ ఎమర్జెన్సీ సహాయం కావాలని సందేశం పంపారు. అనంతరం రెస్యూ సిబ్బంది వచ్చేదాగా టెలీమెడిసిన్ ద్వారా అత్యవసర వైద్యానికి సలహాలు ఇచ్చారు.
సందేశం వచ్చిన వెంటనే అప్రమత్తమైన ఇండియన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది బాధితుడిని అత్యవసరంగా ఆసుపత్రికి చేర్చేందుకు ఏఎల్‌హెచ్ ఎంకే-3 (అధునాతన, తేలికపాటి) హెలికాప్టర్‌తో ఆగస్టు 16-17 రాత్రి బయలుదేరారు. ఆ సమయంలో చైనా నౌక అరేబియా సముద్రంలో తీరానికి దాదాపు 200 కి.మీల దూరంలో ఉంది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. కోస్ట్‌గార్డ్ చిమ్మచీకట్లో ధైర్యంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. అర్ధరాత్రి సమయంలో నౌకలో నుంచి వీగ్‌యాంగ్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేసింది. అనతంరం హెలికాప్టర్‌లోనే ప్రథమ చికిత్స అందించి.. తీరంలోని సమీప ఆసుపత్రికి తరలించింది. ఈ మేరకు భారత రక్షణ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.