US President Powers And Functions : అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు అధ్యక్షుడు కావడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఆ పదవిలో ఉండేవారికి ఎన్నో సూపర్ పవర్స్ ఉంటాయి. నాలుగేళ్ల పదవీ కాలం ముగిసే వరకు దేశాధ్యక్షుడు అత్యంత కీలక విధులను నిర్వర్తిస్తారు. ఇంతకీ యూఎస్ ప్రెసిడెంట్‌కు ఉండే అధికారాలు ఏమిటి ? ఆయన నిర్వర్తించే ముఖ్య విధులు ఏమిటి ? ఈ కథనంలో తెలుసుకుందాం.
కార్యనిర్వాహక అధికారాలివీ
- అమెరికాలో దేశాధ్యక్షుడే ప్రధాన కార్యనిర్వాహకుడు. ప్రభుత్వ నిర్వహణ బాధ్యత ఆయనదే. దేశ పాలనా విధానాలు, విదేశాంగ వ్యవహారాల వ్యూహ రచన వంటివన్నీ ఆయన కనుసన్నల్లో నిర్ణయమవుతాయి.
- అన్ని ప్రభుత్వ విభాగాల్లో చట్టాల అమలు తీరును అధ్యక్షుడే పర్యవేక్షిస్తాడు. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు, చేర్పులు చేసేది ఈయనే.
- మంత్రుల నియామకం, ప్రభుత్వ సంస్థలకు సారథుల నియామకంపైనా తుది నిర్ణయం ప్రెసిడెంట్‌దే.
- అమెరికా చట్టసభల ఆమోదం లేకుండా దేశాధ్యక్షుడు జారీ చేసే ఆదేశాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు. అత్యవసర వ్యవహారాల్లో ఈ తరహా ఆర్డర్స్‌ను ప్రెసిడెంట్ ఇవ్వొచ్చు. వీటికి చట్టబద్ధత ఉంటుంది. అయితే ఈ ఆర్డర్స్‌ను కోర్టుల్లో సవాల్ చేయొచ్చు.
- అమెరికా చట్టసభలు (కాంగ్రెస్), న్యాయ వ్యవస్థలు దేశాధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ను సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటాయి.
శాసన అధికారాలివీ!
- అమెరికాలో చేసే కొత్త చట్టాలపై అధ్యక్షుడికి పూర్తి నియంత్రణ ఉంటుంది. ఆయన అవగాహనతోనే వాటిని ఆమోదం కోసం చట్టసభల్లో ప్రవేశపెడతారు.
- అమెరికా చట్టసభలు ఏటా ఒకసారి సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తుంటాయి. దానికి దేశాధ్యక్షుడు అధ్యక్షత వహించి ప్రసంగిస్తారు. చట్టసభలకు దిశానిర్దేశం చేస్తారు.
- జాతీయ స్థాయి అత్యవసర అంశాలపై చట్టసభలను(కాంగ్రెస్) వెంటనే సమావేశపర్చే అధికారం ప్రెసిడెంట్‌కు ఉంటుంది.
- అమెరికా ప్రెసిడెంట్‌కు వీటో పవర్ ఉంటుంది. దీని ద్వారా ఆయన అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన బిల్లును కూడా తిరస్కరించగలరు. తన పాలనకు, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే బిల్లులపైకి వీటో పవర్‌ను ప్రెసిడెంట్ ప్రయోగిస్తారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలు మూడింట రెండోవంతు మెజారిటీతో దేశాధ్యక్షుడి వీటో పవర్‌ను అడ్డుకోగలవు.
సైనికాధినేత
అమెరికా అధ్యక్షుడిని దేశ కమాండర్ ఇన్ చీఫ్‌గా భావిస్తారు. అన్ని సైనిక విభాగాలు ఆయన పరిధిలోనే పనిచేస్తాయి. సైన్యం మోహరింపు, సైనిక ఆపరేషన్ల నిర్వహణ వంటి వాటిపై ప్రెసిడెంట్ నుంచే ఆదేశాలు వెలువడతాయి. దేశ భద్రత కోసం, జాతీయ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయమైనా ఆయన తీసుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో దీర్ఘకాలంలో అమెరికా చరిష్మాను కాపాడేలా ప్రెసిడెంట్ నిర్ణయాలను తీసుకుంటారు. యుద్ధ సంబంధ నిర్ణయాలను ఆయన నేరుగా తీసుకోవచ్చు. అయితే వాటిని 48 గంటల్లోగా అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేయాలి. దేశ చట్టసభల ఆమోదం లేకుండా విదేశాల్లో సైనిక కార్యకలాపాలను 60 రోజులకు మించి చేయకూడదు. మరో దేశంపై యుద్దాన్ని ప్రకటించే అధికారం మాత్రం అమెరికా కాంగ్రెస్‌కే ఉంటుంది. తద్వారా అధ్యక్షుడి సైనిక శక్తులపై నియంత్రణ కొనసాగుతుంది.
దౌత్యపరమైన విధులు
అమెరికా అంటేనే అగ్రరాజ్యం. ఇతర ప్రపంచదేశాలతో చాలా వ్యవహారాలను ఈ దేశం నెరుపుతుంటుంది. అమెరికా అధ్యక్షుడు అయ్యే వారికి దౌత్యపరమైన విధులు చాలానే ఉంటాయి. కొన్నిదేశాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఇంకొన్ని దేశాలకు హెచ్చరికలు ఇవ్వాల్సి ఉంటుంది. మరికొన్ని దేశాలపై ఆంక్షలు విధించాల్సి ఉంటుంది. ఇంకా పలు దేశాలతో ఆయుధాల క్రయ,విక్రయ ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రెసిడెంట్ కనుసన్నల్లో జరుగుతాయి. అమెరికా వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకు దోహదపడేలా దౌత్యనీతిని అమలు చేసేది అధ్యక్షుడే.
న్యాయపరమైన విధులు
అమెరికా అధ్యక్షుడికి న్యాయమూర్తులను నియమించే అధికారం ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఫెడరల్ కోర్టుల జడ్జీలను ఆయనే నియమిస్తారు. వివిధ నేరాలకు పాల్పడిన వారికి క్షమాభిక్షను ప్రసాదించే అధికారం ప్రెసిడెంట్‌కు ఉంటుంది. కాగా, పాలనా కాలం ముగిసే వరకు అధికార పార్టీ అధినేతగానూ దేశాధ్యక్షుడే వ్యవహరిస్తారు.