TSRTC New Buses : రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంతో చాలా మంది ప్రయాణికులు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సులు చాలా రద్దీగా మారాయి. నిత్యం బస్సుల్లో సీట్లు సరిపోక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది నిలబడే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో తమకు తగినన్ని బస్సులను వేయాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
1000 కొత్త బస్సులు : దీంతో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం కొత్త బస్సుల కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రయాణికల రద్దీకి సరిపడా బస్సులు లేవు. దీంతో 1000 కొత్త బస్సులను తీసుకురానుంది. రోజుకు సగటున 95-115 వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుంది. దీనికి అనుగుణంగా బస్సులు నడపడం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. మరోవైపు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత నుంచి బస్సులు సరిపడటం లేదు. కాలం చెల్లిన బస్సులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతో వీలైనంత త్వరగా కొత్త బస్సుల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
బస్సులు సరిపోవటం లేదు : బస్సులు సరిపోవడం లేదని ఎమ్మెల్యేల నుంచి ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు 348 పైగా విజ్ఞప్తులు వచ్చాయి. 1244 కొత్త బస్సులు అవసరం ఉందని ఆర్టీసీ కూడా ప్రభుత్వానికి నివేదించింది. కొత్తగా కొనుగోలు చేసే బస్సుల్లో 500 బస్సులను కాలం చెల్లిన వాహనాల స్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. మిగతా 500 బస్సులను ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తిప్పనున్నారు. ప్రత్యేకంగా మహాలక్ష్మి ప్రయాణికుల కోసం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు 350 వరకు కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది.
రూ.350 నుంచి రూ.400 కోట్లు : 1000 బస్సులు కొనాలంటే సుమారుగా రూ.350 నుంచి రూ.400 కోట్లు ఖర్చవుతుంది. దీని కోసం ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సహకారం అడిగినట్లు సమాచారం. ఇప్పటికే మహాలక్ష్మి కోసం ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లకు పైగా ఇస్తుంది. దీంతో కొత్త హామీపై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. దీంతో ఉన్నతాధికారులు బ్యాంకు రుణాలకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆర్టీసీ తీవ్రమైన నష్టాల్లో ఉండటంతో అప్పులించేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు. ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది. 97 బస్ డిపోల్లో 72 లాభాల్లో ఉండడంతో రుణ సేకరణకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
'సంక్రాంతి'తో బ్లాక్‌బస్టర్ కొట్టిన తెలంగాణ RTC - రూ.100 కోట్లు దాటిన కలెక్షన్స్!
సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు - ఆ తేదీల్లో నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వెల్లడి