బైక్‌పై వెళ్తున్నవారిపై అకస్మాత్తుగా కుప్పకూలిన ఇల్లు- ఒకరు మృతి - house fell on bike
🎬 Watch Now: Feature Video
Published : Nov 2, 2023, 5:12 PM IST
House Collapsed On Couple : హరియాణాలోని పానీపత్‌లో బైక్‌పై వెళ్తున్న దంపతులపై ఇంటిలో కొంత భాగం కూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..
బాధితులు సుతానా గ్రామానికి చెందినవారు. దంపతులిద్దరూ కలిసి పచ్రంగ బజార్‌కు షాపింగ్ కోసం వెళ్లారు. మార్కెట్‌లోని ఓ పాత ఇంటిలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. బైక్‌పై వెళ్తున్న దంపతులు షాపింగ్ కోసం దుకాణానికి వెళ్తుండగా.. అకస్మాత్తుగా ఇల్లు కుప్పకూలింది. వెంటనే దుకాణదారులు అక్కడికి వెళ్లి చూడగా శిథిలాల కింద దంపతులు పడి ఉన్నారు. వెంటనే వాటిని తొలగించి చూస్తే.. భర్త అప్పటికే మృతి చెందాడు. దుకాణదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మృతుడి భార్యను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.