Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి భారీవర్షం.. చెరువులుగా మారిన రహదారులు
🎬 Watch Now: Feature Video
Heavy Rain in Hyderabad : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ఈ ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి భారీ వర్షం (Heavy Rain in Hyderabad) కురిసింది. కొద్దికొద్దిగా ప్రారంభమైన వర్షం కొద్ది సేపట్లోనే భారీవర్షంగా మారింది. రాయదుర్గం నుంచి మొదలైన వర్షం క్రమంగా వనస్థలిపురం వరకు విస్తరించింది. రాయదుర్గం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, సుచిత్ర, సనత్‌నగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, అల్వాల్, ప్యారడైజ్, బేగంపేట్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ట్యాంక్‌బండ్, తార్నాక, నాగోలు, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది.
Heavy Rain in Hyderabad Caused Problems Motorists : సాయంత్రం వరకు వాన కురవకపోవడంతో.. రహదారులపైకి వచ్చిన వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న ఉద్యోగులు వర్షంలో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా కుండపోతగా కురియడంతో.. క్షణాల్లోనే రహదారులు చెరువులుగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాయదుర్గం, కూకట్‌పల్లి, పంజాగుట్ట, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.కూకట్ పల్లి ఏరియాలోని హైదర్ నగర్ రోడ్లో హోలిస్టిక్ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాల ముందు భారీగా వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. గంటన్నర పాటు రోడ్డుపై వరదనీరు నిలిచిపోవడంతో నిజాంపేట్-బాచుపల్లి రహదారిలో వాహనదారులు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.