ఏపీలో ఓటు రద్దు చేసుకుని.. తెలంగాణలో తీసుకోండి: హరీశ్‌రావు - Harish Rao interesting comments on Andhra Pradesh
🎬 Watch Now: Feature Video
సంగారెడ్డి జిల్లాలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలన ఎలా ఉందో.. అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసని అన్నారు. ఏపీకి, తెలంగాణకు.. భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. సంగారెడ్డిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన హరీశ్.. మేడే సందర్భంగా మే 1న కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పథకాలు ప్రకటిస్తారని తెలిపారు.
ఎంతో మంది ఇతర రాష్ట్రాల వాళ్లు వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారని హరీశ్ రావు అన్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మంది వచ్చారని చెప్పారు. 'ఏపీ, తెలంగాణ.. ఈ రెండు ప్రాంతాలనూ మీరు చూశారు. మీరు ఎప్పుడన్నా అక్కడికి పోతారు కదా? అక్కడి రోడ్లు, దవాఖానాల పరిస్థితి ఏందో మీకు తెలియదా? అన్నీ చూశారు మీరు. మరి మీకు అక్కడ ఓటెందుకు? అక్కడ బంద్ జేసుకొని ఇక్కడ నమోదు చేసుకోండి. మీరు కూడా మావాళ్లే. తెలంగాణ పట్టణాల్లో, గ్రామాల్లో అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఒక దిక్కే ఓటు పెట్టుకోండి.. అదీ తెలంగాణలోనే పెట్టుకోండి’ అని హరీశ్‌రావు అన్నారు.