పవన్‌కల్యాణ్ లాంటి తెలంగాణ వ్యతిరేకితో బీజేపీ చేతులు కలిపింది ద్రోహులంతా ఒక్కటవుతున్నారు : హరీశ్‌రావు - హరీశ్ రావు లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video


Published : Nov 4, 2023, 1:44 PM IST
Harish Rao Comments on Pawan Kalyan : తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవుతున్నారని.. రాష్ట్ర ప్రజలు దీనిని గమనించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బీఆర్ఎస్ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటుపై తనకు ఆకలి కావడం లేదని గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఎందుకు వచ్చిందో అని తీవ్రంగా బాధపడ్డాడని అన్నారు. పవన్‌కల్యాణ్ లాంటి తెలంగాణ వ్యతిరేకితో బీజేపీ చేతులు కలపడం ఏంటని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నరనరాన తెలంగాణ వ్యతిరేకతను జీర్ణించుకుందని హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోటీ చేస్తామని ప్రకటించిన షర్మిల.. కాంగ్రెస్‌తో చేతులు కలిపిందని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఒకవైపు.. తెలంగాణ వాదులంతా ఒకవైపు ఉన్నారని.. ఎవరు గెలవాలో ప్రజలు నిర్ణయించుకోవాలని మంత్రి కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 9 స్థానాలు బీఆర్ఎస్కే ఉన్నాయని.. సంగారెడ్డిలో గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు. జహీరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్‌రావును మరోసారి గెలిపించాలని కోరారు. మిగిలిన 25 రోజుల పాటు నేతలు, నాయకులు స్థానికంగా ఉంటూ.. గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.