బరాత్‌లో డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు.. వరుడి సోదరుడు మృతి - డ్యాన్స్చేస్తూ కుప్పకూలిన వరుడి సోదరుడు
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్ ఎటా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుక విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి అనంతరం బరాత్‌లో పాల్గొన్న వరుడి సోదరుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో శుభకార్యం జరిగిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ జరిగింది...
రాంపుర్ స్టేషన్ పరిధిలోని మోహల్లా గర్గీ ప్రాంతానికి చెందిన సంజూ.. తన సోదరుడి వివాహ వేడుకలో పాల్గొన్నాడు. వివాహం అనంతరం బరాత్ (ఊరేగింపు) నిర్వహించారు. వధూవరుల కుటుంబ సభ్యులు అందరూ ఎంతో ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు. సంజూ సైతం అందరితో కలిసి ఆడిపాడాడు. డీజే పాటలకు స్టెప్పులేస్తూ.. సోదరుడి పెళ్లి వేడుకల్లో జోష్ నింపాడు. ఈ క్రమంలోనే ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్న సంజూ.. ఉన్నట్టుండి నేలకు ఒరిగాడు. అక్కడ ఉన్నవారందరూ అది కూడా ఓ డ్యాన్స్ స్టెప్పే అయ్యుంటుందని ఎవరూ అతడిని తాకే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపైనా సంజూ నేలపై నుంచి లేవకపోవడం వల్ల అక్కడున్న వారు దగ్గరకు వెళ్లి చూడగా.. అతడిలో చలనం లేదు. వెంటనే స్థానిక ఆసుపత్రికి సంజూను తరలించారు. కానీ సంజూ అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సోదరుడి మరణంతో పెళ్లి రోజే వరుడు కన్నీటిపర్యంతమయ్యాడు