Nizamabad IT hub : 'నిజామాబాద్ ఐటీ హబ్‌లో గ్లోబల్ లాజిక్ సంస్థ పెట్టుబడులు..! మహిళలకే పెద్దపీట' - తెలంగాణ తాాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
MLC Kalvakuntla Kavitha On IT Companies in Nizamabad : నిజామాబాద్ ఐటీ హబ్‌లో త్వరలోనే పలు ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. యువతకు స్థానికంగానే ఉద్యోగావకాలు కల్పించాలనే ఉద్ధేశంతో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారని స్పష్టం చేశారు. హిటాచీ గ్రూపు సబ్సిడరీ, గ్లోబల్ లాజిక్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లితో కవిత భేటీ అయ్యారు. నిజామాబాద్‌లో త్వరలో ప్రారంభం కానున్న ఐటీ హబ్‌లో కంపెనీలు ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. సంస్థకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. నిజామాబాద్ ఐటీ హబ్‌కు రవాణా, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలతో పాటు శాంతి భద్రత వివరాలను కంపెనీ ప్రతినిధులకు ఎమ్మెల్సీ వివరించారు. ఐటీ హబ్‌లో కంపెనీ స్థాపనకు గ్లోబల్ లాజిక్ సంస్థ సానుకూలంగా స్పందించింది. నిజామాబాద్‌లో తాము పెట్టబోయే కంపెనీలో మహిళలకు పెద్దపీట వేస్తామని నిర్వహకులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఐటీ హబ్‌ను మంగళవారం కంపెనీ ప్రతినిధులు పరిశీలించనున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు.. హైదరాబాద్‌లో గచ్చిబౌలి, జూబ్లిహిల్స్ కేంద్రాల్లో సుమారు 3వేల మంది పనిచేస్తున్నారు. ఐటీ హబ్‌లో కంపెనీని ఏర్పాటు చేయాలన్న తన విజ్ఞప్తికి గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని కవిత అన్నారు.