హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
🎬 Watch Now: Feature Video
Fire accident at Jeedimetla Industrial Estate: రాష్ట్రంలోని జంట నగరాల్లో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటి వల్ల నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనను మరవకముందే జీడిమెట్లలో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కోపల్లే ఫార్మా రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివిధ రసాయనాలు అంటుకుని భారీ మంటలు ఎగిసి పడ్డాయి. పరిసర ప్రాంతాల్లో కరెంట్ లేక పోవటం, పెద్ద మంటలు చెలరేగినందున అగ్నిమాపక సిబ్బంది 4 గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ కంపెనీని గత కొన్ని రోజులుగా మూసివేశారు. ప్రమాద సమయంలో సెక్యూరిటీ సిబ్బంది మినహా ఎవరూ లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది. గతంలో నిషేధిత డ్రగ్స్ తయారుచేస్తూ పట్టుబడటంతో పీసీబీ, అగ్ని మాపక సిబ్బంది ఈ కంపెనీని సీజ్ చేశారు. మొత్తం 8 నుంచి 10 ఎకరాలలో విస్తరించిన కంపెనీలో వ్యర్థ రసాయనాల పారబోత, ద్రావణాలు నిల్వ చేసిన డ్రమ్స్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.