చెప్పులతో కొట్టుకున్న బీజేపీ కార్యకర్తలు.. ఎమ్మెల్యే సమక్షంలోనే గొడవ - Ghaziabad Municipal Election
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్ జిల్లాలోని బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంలో కార్యకర్తలు వీరంగం సృష్టించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లను తమకు కేటాయించలేదనే ఆరోపణతో రెండు వర్గాలు తీవ్ర వాగ్వాదానికి దిగాయి. గాజియాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా సోమవారం ఈ ఘర్షణ జరిగింది. ఈ గొడవలో కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి దిగారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఖోడా మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఆదేశాల మేరకే తమకు దక్కాల్సిన టిక్కెట్లను రద్దు చేశారని కార్యకర్తలు ఆరోపించారు. ఆ సమయంలో సాహిబాబాద్ బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ కూడా అక్కడే ఉన్నారు. అయితే నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ కూడా బీజేపీ మేయర్ అభ్యర్థి సునీతా దయాళ్‌తో కలిసి గాజియాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే ఆఫీస్‌కు సమీపంలోని మేయర్ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ ఘర్షణ సమయంలో అక్కడే ఉన్న బీజేపీ మేయర్ అభ్యర్థి సునీతా దయాళ్ నామినేషన్ దాఖలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తంగా కార్పొరేషన్‌లోని కార్పొరేటర్ పదవులకు ఇచ్చే టికెట్లు తమకు కాదని కావాల్సిన వారికే ఇచ్చారని ఖోడా మున్సిపాలిటీ చైర్‌పర్సన్ రీనా భాటికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు కార్యకర్తలు. కొందరు వ్యక్తులు నేతలతో కుమ్మక్కై టికెట్లు కొనుగోళ్లు చేశారని వారు ఆరోపించారు. ఈ గొడవ సమయంలో పలువురు సీనియర్ నేతలు కూడా కార్యాలయంలోనే ఉన్నారు. ఇక ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.