రైతుకు అధికారులు లంచం డిమాండ్.. డబ్బు బదులు ఎద్దు ఇస్తానంటూ..
🎬 Watch Now: Feature Video
అప్పటి వరకు ఓపిక పట్టిన రైతుకు సహనం నశించింది. లంచం అడిగిన అధికారులకు డబ్బుకు బదులు ఎద్దును ఇస్తానని ఏకంగా మున్సిపల్ కార్యాలయానికే ఎద్దును తీసుకెళ్లాడు. అప్పటికే లంచం ఇచ్చిన అధికారులు బదిలీ కావడం వల్ల మళ్లీ ఇచ్చుకోలేనని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
హవేరి జిల్లాలోని సవనూర్ మున్సిపాలిటీకి చెందిన ఎల్లప్ప రానోజి అనే రైతు.. మున్సిపల్ రికార్డుల్లో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తన పని జరగాలంటే లంచం ఇవ్వాలని అధికారులు ఎల్లప్పను డిమాండ్ చేశారు. అధికారులకు ఎల్లప్ప లంచం ఇచ్చాడు. అయితే, ఎల్లప్ప పని చేయకుండానే ఆ ఆఫీసర్లు వేరే చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. కొత్త ఆఫీసర్లు కూడా ఎల్లప్పను లంచం డిమాండ్ చేశారు. దీంతో నిస్సహాయుడైన ఎల్లప్ప.. అధికారులపై నిరసన తెలియజేయాలనుకున్నాడు. వెంటనే తన ఎద్దును తీసుకుని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు. లంచానికి బదులు ఈ ఎద్దును తీసుకోవాలని కోరాడు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఎల్లప్పకు సంబంధించిన రికార్డుల్లో మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.